ఫిల్మ్ ఇండస్ట్రీని విజయవాడకు రప్పిస్తాం..

28 Sep, 2017 11:03 IST|Sakshi

ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికా కృష్ణ

సాక్షి, విజయవాడ :  చలన చిత్ర రంగాన్ని విజయవాడకు రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నానని ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికా కృష్ణ పేర్కొన్నారు. జాషువా జయంతి ఉత్సవాల్లో భాగంగా గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జాషువా సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలుగు షార్ట్‌ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ముగింపు కార్యక్రమంలో బుధవారం ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. చిన్న సినిమాలను ఏపీలో తీస్తే ప్రత్యేకమైన రాయితీ ఇవ్వడం ద్వారా చిత్ర నిర్మాణాన్ని రాష్ట్రానికి తీసుకురావాలనుకుంటున్నామని వెల్లడించారు.  

షార్ట్‌ ఫిల్మ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు, నటుడు ఎల్బీ శ్రీరామ్‌ మాట్లాడుతూ.. అమరావతి కథలు పేరిట షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించడం తన ఆశయమన్నారు. అందుకు ఎఫ్‌డీసీ గానీ, ఎన్నారైలు కానీ ఆర్థిక సహకారమందించాలని కోరారు. జాషువా మనమడు సుశీల్‌కుమార్‌ మాట్లాడుతూ.. సమాజంలో రుగ్మతలు, అసమానతలను రచనల ద్వారా శక్తివంతంగా ఎత్తిచూపిన తన తాత గారి ఆశయాల మేరకు సమాజ సేవలో ఇతోధికంగా పాల్గొంటున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని జాషువా సాంస్కృతిక వేదిక బాధ్యుడు, సీనియర్‌ జర్నలిస్టు జీవీ రంగారెడ్డి ప్రారంభించగా.. గుండు నారాయణరావు గౌరవ అధ్యక్షత వహించారు. సభలో సినీ దర్శకుడు సి.ఉమామహేశ్వరరావు, షార్ట్ ఫిల్మ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ప్రసాద్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు