సైరాకి సై

26 Jul, 2018 00:49 IST|Sakshi
చిరంజీవి, అమిత్‌ త్రివేది

నరసింహారెడ్డి చేసే సాహసాలకు తెరపై సంగీతం అందించడానికి  సంగీత దర్శకుడు దొరికారట. ఆల్రెడీ నేపథ్య సంగీతానికి సంబంధించిన పనులు స్టార్ట్‌ అయ్యాయట.  చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. షెడ్యూల్‌ బిజీ  కారణంగా ఈ చిత్రం నుంచి సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కీరవాణి, యస్‌.యస్‌. తమన్‌ అని పలు పేర్లు వినిపించాయి. కానీ ఎవరి పేరూ కన్‌ఫర్మ్‌ అయినట్లు న్యూస్‌ రాలేదు.

లేటెస్ట్‌గా బాలీవుడ్‌ సంగీత దర్శకుడు అమిత్‌ త్రివేది ‘సైరా’ సినిమాకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సై అన్నట్లు సమాచారం. ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్, క్వీన్, డియర్‌ జిందగీ, ప్యాడ్‌మ్యాన్‌’ వంటి పాపులర్‌ సినిమాలకు సంగీతం అందించారాయన. త్వరలో స్టార్ట్‌ కానున్న ప్రభాస్‌– రాధాకృష్ణ కుమార్‌ సినిమాకు కూడా అమిత్‌నే సంగీతం సమకూర్చనున్నారు. ‘సైరా’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్‌ కంపోజిషన్‌ కూడా స్టార్ట్‌ చేశారట అమిత్‌. ఈ సినిమాలో మూడు పాటలకు ట్యూన్స్‌ ఇచ్చే పనిలో పడ్డారాయన. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్‌ 22న రిలీజ్‌ కానున్న చిత్రం టీజర్‌కు వచ్చే బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ పనిలో ప్రస్తుతం బిజీ ఉన్నారట. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుదీప్‌ కీలక పాత్రలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు