కాలేజి పాపల బస్సు...

17 Sep, 2019 02:49 IST|Sakshi
అమితాబ్‌ బచ్చన్‌

రద్దీ బస్‌స్టాప్‌. ఆ బస్‌స్టాప్‌లో హీరో, తన ఫ్రెండ్స్‌ వెయిట్‌ చేస్తుంటారు. అమ్మాయిలు ఎక్కువగా ఉన్న బస్‌ వచ్చినా, లేడీస్‌ కాలేజీకు వెళ్లే బస్‌లు వచ్చినా ఎక్కి సరదా వేషాలు వేస్తుంటారు. ఇది చాలా సినిమాల్లో కనిపించే సన్నివేశమే. ‘విక్రమార్కుడు’ సినిమాలో అయితే ఏకంగా ‘కాలేజి పాపల బస్సు..’ అనే పాట కూడా ఉంది. ఇలా బస్సులో మిస్సుల కోసం అమితాబ్‌ బచ్చన్‌ ఎదురు చూసేవారట. ‘‘అందమైన అమ్మాయిల కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవాళ్లం’’ అని యవ్వనం తాలూకు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు అమితాబ్‌. ‘‘నేను ఢిల్లీ యూనివర్శిటీలో విద్యార్థిగా ఉన్న రోజులవి. కాలేజీకి రోజూ బస్‌లో వెళ్లేవాణ్ణి. మా ఏరియా నుంచి నా కాలేజీకి వెళ్లే దారిలో కొన్ని లేడీస్‌ కాలేజీలు ఉన్నాయి.

అక్కడ బస్‌ ఎక్కే అమ్మాయిల్ని చూడటానికి బాగా ఎదురుచూసేవాళ్లం. ఆ స్టాప్‌ తొందరగా  రావడానికైనా బస్‌ ఫుల్‌ స్పీడ్‌గా వెళ్లాలి అనుకునేవాళ్లం’’ అని గతాన్ని షేర్‌ చేసుకున్నారు. అంతేకాదు యూనివర్శిటీ చదువు పూర్తయిన తర్వాత ఆ ఏరియాకు చెందిన ఓ అమ్మాయిని కలుసుకున్నట్టు తెలిపారు. ఆమె చెప్పిన విషయం విని అమితాబ్‌ ఆశ్చర్యపోయారట. ‘‘మీరు కాలేజీకి వెళ్లే దార్లోనే ఓ బస్‌ స్టాప్‌లో మీ కోసం ఎదురుచూసేదాన్ని. నేను, మా ఫ్రెండ్‌ ప్రాణ్‌ అక్కడే వేచి చూసేవాళ్లం. మీరు వచ్చినప్పుడల్లా మనసులో ఒకటే ఆలోచన.. ‘ప్రాణ్‌ (ప్రాణం) పోయినా ఫర్వాలేదు. బచ్చన్‌ వెళ్లిపోకూడదు’ అనుకునేదాన్ని’’ అంటూ ఆమె ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారని అమితాబ్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు