ఆస్పత్రి నుంచి ఇంటికి చేరిన అమితాబ్‌

19 Oct, 2019 19:31 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (77) ఆస్పత్రి నుంచి శుక్రవారం రాత్రి డిశ్చార్జి అయ్యారు. ఆయన వెంట సతీమణి జయాబచ్చన్‌, కొడుకు అభిషేక్‌ బచ్చన్‌ ఉన్నారు. రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా నాలుగు రోజుల క్రితం ఆయన నానావతి ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న అమితాబ్‌.. ఆ చికిత్సలో భాగంగా క్రమం తప్పకుండా వైద్యుల్ని సంప్రదిస్తుంటారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బిగ్‌బీ ఆస్పత్రిలో ఉన్న సమయంలో కూడా వరుసగా రెండు ట్వీట్లు చేసి అభిమానులను పలుకరించారు. తొలుత జయాబచ్చన్‌తో కార్వా చౌత్‌ పండుగలో పాల్గొన్న ఓ ఫొటోను షేర్‌ చేసిన అమితాబ్‌ .. దానికి అందమైన క్యాప్షన్‌ జత చేశారు. 

‘నాలో సగం. అందుకే హాఫ్‌ ఇమేజ్‌ కనిపించేటట్టు షేర్‌ చేశా. మిగతా సగం కనిపించాల్సిన అవసరమేముంది’అని ట్వీట్‌ చేశారు. ఇక మరో ట్వీట్‌లో జయాతో కలిసి వారం క్రితం పాల్గొన్న ఒక ఈవెంట్‌ ఫొటో షేర్‌ చేశారు. ఇదిలాఉండగా.. 20 ఏళ్ల క్రితం కూలీ నెం.1 సినిమా షూటింగ్‌లో అమితాబ్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనకు అత్యవసరంగా రక్తం ఎక్కించాల్సి వచ్చింది. ఆసమయంలో జరిగిన ఓ పొరపాటు బిగ్‌బీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. సరైన రక్తం ఎక్కించని కారణంగా ఆయన కాలేయం చెడిపోయింది. తన కాలేయంలో కేవలం 25 శాతం మాత్రమే పనిచేస్తుందని, అయినప్పటికీ వైద్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఆరోగ్యంగా ఉన్నానని బిగ్‌బీ ఓ సందర్భంలో చెప్పారు. ఇక అమితాబ్‌ తాజాగా ‘చెహ్రే అండ్‌ గులాబో సితాబో’ చిత్రంలో నటిస్తున్నారు. దాంతోపాటు కౌన్‌ బనేగా కరోడ్‌ పతి 11వ సీజన్‌కు ఆయన హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

మరిన్ని వార్తలు