ఇంట్లో ఉండనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం!

28 Jun, 2014 01:13 IST|Sakshi
ఇంట్లో ఉండనివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాం!

ప్రతి అభిమానికీ తన అభిమాన తారను ఒక్కసారైనా నేరుగా చూడాలనే కోరిక ఉంటుంది. వీలైతే ఓ ఆటోగ్రాఫ్ తీసుకుని, ఫొటోగ్రాఫ్ కూడా దిగాలని ఉంటుంది. ఒకవేళ ఆ స్టార్‌తో నాలుగు మాటలు మాట్లాడే అవకాశం వస్తే, అదే మహాభాగ్యం అని కూడా అనుకుంటారు. కానీ, అమితాబ్ బచ్చన్‌కి వీరాభిమాని అయిన ఓ మహిళకు ఇవేవీ అవసరం లేదు. ఏకంగా అమితాబ్ ఇంట్లో బస చేయాలన్నది ఆమె కోరిక. ఆ అభిమాని వయసు 39ఏళ్లు. తన 16ఏళ్ల కూతురితోకలిసి ఓ వారం రోజులు అమితాబ్ బచ్చన్ ఇంటి ముందు నానా రభస చేసిందావిడ.

అమితాబ్‌కి తాను వీరాభిమానిని అని, కూతురితో సహా తనను ఆయన ఇంట్లో ఉండనివ్వాలని గేటు ముందు నిలబడి సెక్యూర్టీతో వాదన పెట్టుకుందట. అమితాబ్ ఇంట్లో తను కూడా ఉంటే, అప్పుడు రోజూ ఆయన దర్శన భాగ్యం దొరుకుతుందన్నది ఈవిడగారి కోరిక. తన కోరికను స్వయంగా అమితాబ్‌తో చెప్పడానికి ముంబయ్‌లోని అమితాబ్ స్వగృహం ‘జల్సా’కి వెళ్లింది ఆ మహిళ.

అమితాబ్‌ని కలవనివ్వకపోయినా, తనను ఆ ఇంట్లో ఉండనివ్వకపోయినా తాను, తన కూతురు ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించిందట. తనను ఇంట్లో ఉండనివ్వడానికి ఇష్టపడకపోతే కనీసం పనిమనిషిగా అయినా నియమించుకుంటే, అయ్యగార్ని రోజూ చూస్తానని కూడా పేర్కొందట. తమ ప్రాణాలను కాపాడాలంటే, వెంటనే ఆ ఇంట్లోకి అనుమతించాలని హెచ్చరించిందట.

దాంతో అమితాబ్ వ్యక్తిగత సిబ్బంది పోలీసులకు సమాచారం పంపించారట. పోలీసులు రంగంలోకి దిగి, ఆమెకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా ససేమిరా అన్నదట. తన కోరికను ఒక ఉత్తరంలో రాసివ్వమని, అమితాబ్‌కి దాన్ని అందజేసిన తర్వాత, తామే టచ్‌లోకి వస్తామని వ్యక్తిగత సిబ్బంది చెప్పారట. ఆ మాటలు నచ్చాయో లేక తన పాచిక పారదనుకుందో ఏమో ఓ ఉత్తరం రాసిచ్చి, వెళ్లిపోయిందట.