ఇప్పటికీ నాకు సిగ్గే!

26 Dec, 2014 23:19 IST|Sakshi
ఇప్పటికీ నాకు సిగ్గే!

భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ నటుల్లో అమితాబ్ బచ్చన్ ఒకరు. నాలుగున్నర దశాబ్దాల సినిమా కెరీర్‌లో ఆయన అందుకోని అభినందనలు లేవు. అయితే, కెరీర్‌లో మొదటి అభినందన అందుకున్నప్పుడు బిడియపడినట్లే ఇప్పటికీ పొగడ్తలంటే బిడియమే అంటున్నారు అమితాబ్. ఇన్నేళ్లయినా ఇంకా అభినందనలకు అలవాటుపడలేదని ప్రముఖ దర్శక, నిర్మాత యశ్ చోప్రా మెమోరియల్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఆ మాటే అందరితో చెప్పడంతో పాటు తన బ్లాగ్‌లో కూడా ప్రస్తావించారు.

వేదికపైన అందరూ అభినందిస్తుంటే, కూర్చుని వింటున్న నేను తెగ ఇబ్బందిపడిపోతుంటాననీ, ఈ అభినందనలకు నేను అర్హుణ్ణి కాదని నా ఫీలింగ్ అనీ అమితాబ్ పేర్కొన్నారు. ఎదుటి వ్యక్తులు అభినందిస్తున్న సమయంలో ఎలాంటి హావభావాలు పెట్టాలో తెలియడం ఓ కళ అనీ, ఆ కళను తానెప్పటికీ నేర్చుకోలేననీ ఆయన అన్నారు. అయితే, అందరూ అభినందిస్తున్నప్పుడు... ఓ నటుడిగా సాధించింది తక్కువ అనీ, ఇంకా సాధించాల్సింది చాలా ఉందనీ అనుకుంటానని తెలిపారు అమితాబ్ బచ్చన్. ఇలా చెప్పడంలోనే అమితాబ్ సంస్కారం ఏంటో తెలుస్తోంది కదూ!

>