కేకులు ఎందుకు పూస్తారు: అమితాబ్

11 Oct, 2016 11:16 IST|Sakshi
కేకులు ఎందుకు పూస్తారు: అమితాబ్

పుట్టినరోజు వేడుకలు చేసుకునే విషయంలో తన ఆలోచనలను అమితాబ్ అందరితో పంచుకున్నారు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు స్నేహితులు, క్లాస్‌మేట్లతో కలిసి పండగ, కొత్తబట్టలు, చిన్న చిన్న బహుమతులు.. తల్లిదండ్రుల నుంచి ఆశీస్సులు తీసుకోవడం అంతా బాగుంటాయన్నారు. కానీ, అసలు కేకులు ఎందుకు తెస్తారో మాత్రం తనకు తెలియదని అయన చెప్పారు. పుట్టినరోజు సందర్భంగా తన ఇంటి వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ''అసలు కేకులు ఎందుకు తెస్తారో నాకు తెలియదు. కొవ్వొత్తి ఎందుకు వెలిగిస్తారు, దాన్ని ఎందుకు ఆర్పేస్తారు.. చాకుతో కేకును ముక్కలు ముక్కలు చేసి, దాన్ని తినడం.. ఇప్పుడు సరికొత్త వ్యవహారం మొదలైంది కేకు తీసుకుని ముఖానికి పూస్తారు.. ఇదంతా ఎందుకు చేస్తారో నాకు తెలియదు. నేను మాత్రం ఈ కేకులు వ్యవహారాన్ని చాలాకాలం క్రితమే ఆపేశాను'' అని ఆయన చెప్పారు. మరో రెండు రోజుల్లో సర్కార్-3 సినిమా షూటింగ్ మొదలవుతుందని అమితాబ్ తెలిపారు. సర్కార్‌లో ఉన్న కొన్ని పాత్రలు ఇందులో మారుతాయన్నారు. సర్కార్, సర్కార్ రాజ్‌లో చనిపోయిన పాత్రలు మళ్లీ కనిపించవని, సర్కార్ 3 లో కొత్త కథ ఉంటుంది గానీ సర్కార్ అలాగే ఉంటాడని చెప్పారు. ఇందులో కొత్త కళాకారులు కూడా కనిపిస్తారని, సినిమా విడుదలకు సిద్ధమైన తర్వాత కథ గురించి మరిన్ని వివరాలు చెబుతామని అన్నారు.

తాను మరింత కాలం సినిమాలలో నటిస్తానని, ఇంకొన్ని ఛాలెంజింగ్ పాత్రలు చేస్తానని అమితాబ్ అన్నారు. ఇక అమితాబ్‌ను రాష్ట్రపతి చేయాలన్న శతృఘ్నసిన్హా వ్యాఖ్యలను గుర్తుచేయగా.. ఆయన ఏదో చిన్నతనంతో సరదాగా అని ఉంటారని, అలా జరగబోదని తెలిపారు. అలాంటి ప్రశ్నలకు ఇప్పుడు సరైన సమయం కాదని అన్నారు. సరిహద్దులలో జరుగుతున్న సంఘటనల పట్ల ప్రజలంతా చాలా ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పుడు మనమంతా జవాన్లకు సంఘీభావం తెలపాలని చెప్పారు. సైనికులు మన కోసం ప్రాణాలు అర్పిస్తూ.. మన ప్రాణాలు కాపాడుతున్నారన్నారు. ఇక ప్రముఖ నటి హేమమాలిని పుట్టినరోజు కూడా ఇదే నెలలో 16వ తేదీన ఉండటంతో ఆమెకు శుభాకాంక్షలు చెబుతారా అన్న ప్రశ్నకు.. అక్టోబర్ నెలలో చాలామంది పుట్టినరోజలు ఉన్నాయని, వాళ్లందరికీ శుభాకాంక్షలు చెబుతున్నానని అన్నారు.