సంచలన వ్యాఖ్యలు చేసిన అమితాబ్‌ బచ్చన్‌

21 Aug, 2019 15:50 IST|Sakshi

బాలీవుడ్‌ మెగా స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాను 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా బిగ్‌ బీ ‘స్వస్థ్‌ ఇండియా’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు నాకు క్షయ(టీబీ), హెపటైటిస్‌ బీ వ్యాధులు ఉండేవి. అయితే నాకు ఈ వ్యాధులు సోకినట్లు దాదాపు ఎనిమిదేళ్ల పాటు నేను గుర్తించలేకపోయాను. హెపటైటిస్‌ వల్ల అప్పటికే నా కాలేయం 75శాతం పాడయ్యింది. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్ల ఇలా జరిగింది. ప్రస్తుతం నేను 25శాతం కాలేయంతోనే జీవిస్తున్నాను. టీబీకి చికిత్స ఉంది. కానీ ముందుగా గుర్తించకపోవడం వల్ల నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. తరచుగా వైద్య పరీక్షలు చేయించుకుంటుంటే.. ఇలాంటి వ్యాధుల్ని ముందుగానే పసిగట్టవచ్చు. తగిన చికిత్స తీసుకోవచ్చు’ అన్నారు.

అంతేకాక ‘నాలా మరొకరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఇప్పుడీ విషయాల గురించి వెల్లడించాను. ప్రతి ఒక్కరు తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఫలితంగా వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి సులభంగా నివారించవచ్చు’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అమితాబ్‌ కీలక పాత్రలో నటించిన ‘సైరా’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్న పాత్రలో అమితాబ్‌ నటిస్తున్నారు. (చదవండి: ఇండియాలో ఆయనే మెగాస్టార్‌)

మరిన్ని వార్తలు