వందేళ్ల సినిమా వేడుకకు బిగ్ బీ, షారుక్!

15 Jul, 2013 20:40 IST|Sakshi
వందేళ్ల సినిమా వేడుకకు బిగ్ బీ, షారుక్!

చెన్నై : భారతదేశంలో తొలిసారిగా కదిలే బొమ్మల సినిమాను ప్రదర్శించి వంద సంవత్సరాలు గడిచాయి.  భారతీయ సినిమా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్బంగా  ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్, ఏ.పి. ఫిలిం ఛాంబర్, కర్ణాటక ఫిలిం ఛాంబర్, కేరళ ఫిలిం ఛాంబర్‌లు  సంయుక్తంగా కలసి మూడు రోజులపాటు చెన్నైలో సినిమా వేడుక జరపడానికి సన్నాహాలు చేస్తున్నాయి. సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకల హాజరయ్యే అతిథిలు జాబితాలో బాలీవుడ్ బీగ్ బి అమితాబ్ బచ్చన్, షారూఖ్ ఖాన్ల పేర్లు కూడా చేరాయి.

ఈ సందర్భంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సి.కల్యాణ్ మాట్లాడుతూ వందేళ్ల భారతీయ సినిమా వేడుకలకు అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ లు హాజరు అవుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు.  చెన్నైలోని నెహ్రు ఇండోర్ స్టేడియంలో జరగనున్న ఈ కార్యక్రమానికి నాలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కూడా పాల్గొంటారన్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో.... తొలిరోజు తమిళ, మలయాళంకు సంబంధించిన కార్యక్రమాలు, రెండోరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన కార్యక్రమాలు  ఉంటాయని  కళ్యాణ్ తెలిపారు.  చివరి రోజు నాలుగు చిత్ర పరిశ్రమలు కలిసి  ప్రదర్శలు ఇస్తాయన్నారు. ఈ సినిమా వేడుకల్లో భారతదేశంలో ఉన్న అన్ని భాషలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొననున్నారు.

వీటితో పాటు 18 భాషల చిత్ర పరిశ్రమల ప్రముఖులను ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి సత్కరించటంతో పాటు,  చిత్ర పరిశ్రమకు సంబంధించి ప్రముఖుల పోస్టల్ స్టాంప్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ వేడుకలకు ప్రత్యేక గీతాన్ని కంపోజ్ చేయవలసిందిగా మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా, ఎఆర్ రెహ్మాన్లను కోరినట్లు కళ్యాణ్ తెలిపారు. అయితే ఇంకా ఖరారు కావల్సి ఉందన్నారు.  వేడుకల చివరి రోజు ఆ గీతం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి