బచ్చన్‌ సాహెబ్‌

25 Sep, 2019 00:43 IST|Sakshi

బిగ్‌ స్క్రీన్‌ లాంటి వారు అమితాబ్‌ బచ్చన్‌. కళ్లారా చూస్తున్నట్లు ఉంటుంది. ‘దాదా సాహెబ్‌’ అయ్యారుగా.. ఇప్పుడింకా బిగ్‌ అయ్యారు! ఈ పొడవాటి నటుడి జీవితంలో... ప్రతి దశలోనూ అనేక వెలుగు నీడలు. ప్రతి నీడలోనూ అనేక దశలు.. దిశలు.

‘‘నిన్ను నువ్వు మెరుగుపరచుకోవడమే ప్రతీకారం తీర్చుకోవడం’’. మంగళవారం అమితాబ్‌ బచ్చన్‌ ట్వీటర్‌లో కనిపించిన కొటేషన్‌ ఇది. పగ, ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఎదుటి వ్యక్తి నాశనాన్ని కోరుకోవడం కాదు. మనల్ని మనం మెరుగుపరచుకోవడం. అమితాబ్‌ చక్కగా చెప్పారు. ఇంతకుముందు చాలామంది చాలాసార్లు ఈ మాట చెప్పి ఉండొచ్చు. కానీ బిగ్‌ బి చెబితే ఆ మాట పెద్దది అవుతుంది. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి చేరుకున్న వ్యక్తి కాబట్టి. ‘అమితాబ్‌ బచ్చన్‌’ పేరుకి ముందూ వెనకా ‘సూపర్‌ స్టార్‌’, ‘సెహన్‌ షా ఆఫ్‌ బాలీ వుడ్‌’, ‘సాహెబ్‌’, ‘బిగ్‌ బి’.. ఇలా బోలెడన్ని పెద్ద బిరుదులు. కోరుకుంటే సునాయాసంగా వచ్చి పడినవి కాదు. రాత్రింబవళ్లూ కష్టపడి తెచ్చుకున్నవి. అందుకే వాటికి ఎంతో విలువ. ఇప్పుడు అమితాబ్‌కి మరో విలువైనది దక్కింది. అర్హత ఉన్న వ్యక్తికి దక్కాల్సినదే దక్కింది. భారతీయ చిత్రసీమకు గణనీయమైన సేవలందించేవారికి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారం ‘దాదా సాహెబ్‌ ఫాల్కే’ పురస్కారం ‘బచ్చన్‌ సాహెబ్‌’కి దక్కింది.

సాదా సీదా అమితాబ్‌ బచ్చన్‌ సాహెబ్‌ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారు? అది చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుందేమో. ఆయన జీవితం నుంచి ఆదర్శంగా తీసుకోదగ్గవి ఎన్నో ఉన్నాయి. ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకుందాం. మరో 20 రోజుల్లో అమితాబ్‌ బచ్చన్‌ పుట్టినరోజు. 1942 అక్టోబర్‌ 11న పుట్టారు. 77 ఏళ్లు నిండి 78లోకి అడుగుపెడతారు. ఈ 78 ఏళ్ల జీవిత కాలంలో ‘అమితాబ్‌ అయిపోయాడు’ అనుకున్న ప్రతిసారీ ఆ మాటలను ఆయన అబద్ధం చేశారు. అమితాబ్‌ అంటే ‘అమితమైన వెలుగు’ అని అర్థం అని పెద్దవాళ్లు అంటారు. నిజానికి అమితాబ్‌ తల్లిదండ్రులు తేజీ బచ్చన్, హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ కొడుకుకి ‘ఇంక్విలాబ్‌’ అని పేరు పెట్టాలనుకున్నారు. ‘బచ్చన్‌’ అనే కలం పేరుతో హరివంశ్‌రాయ్‌ కవితలు రాసేవారు. ఓ స్నేహితుడి సలహా మేరకు ‘ఇంక్విలాబ్‌’ పేరు పెట్టాలనే ఆలోచనను విరమించుకుని ‘అమితాబ్‌’ అని పెట్టారు. ‘పేరు బలం’ అనేదాన్ని నమ్మొచ్చేమో. నిజంగానే అమితాబ్‌ జీవితం అంతా వెలుగు. అయితే చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుందన్నట్లు అమితాబ్‌ జీవితంలోనూ ‘చీకటి’ ఉంది. సాదాసీదా చీకటి కాదు.. ఎంతో పెద్ద వెలుతురు వస్తే పోయే చీకటి అది.

ఆ వెలుతురు కోసం అమితాబ్‌ ధైర్యంగా నిలబడ్డారు. చీకటిని తరిమేశారు. అసలు సినిమాల్లోకి రావాలని అమితాబ్‌ ఎందుకు అనుకున్నారు? పిల్లల మీద తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. సినిమాల్లోకి రావాలనే అమితాబ్‌ ఆలోచనకు ప్రేరణ ఆయన తల్లి. నటనంటే ఆమెకు చాలా ఇష్టం. సినిమాల్లో నటించమని కూడా ఆమెను అడిగారు. కానీ ఇంటి బాధ్యతలు తీసుకుని, ఇంటిపట్టునే ఉండిపోయారు. ‘‘నువ్వు ఏదైనా చెయ్‌. కానీ నలుగురిలో నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ‘సెంటరాఫ్‌ స్టేజ్‌’లా ఉండాలి’’ కొడుకుతో అన్నారు తేజీ బచ్చన్‌. అమితాబ్‌ కూడా ప్రత్యేకంగా ఉండాలనుకున్నారు. ‘సినిమా’ మంచి ఆప్షన్‌ అనిపించింది. కానీ ముందూ వెనకా ఎవరూ లేరు. ఒంటరి ప్రయాణం మొదలుపెట్టాలి. అలహాబాదులో పుట్టిన అమితాబ్‌ కెరీర్‌ని వెతుక్కుంటూ ముంబైలో అడుగుపెట్టినప్పుడు చేతిలో పెద్దగా డబ్బు లేదు. స్నేహితులు కొందరు ఉన్నారు. అంత త్వరగా సహాయం తీసుకునే మనస్తత్వం కాదు.

సినిమాల్లో అవకాశాలు వచ్చాయా ఓకే.. లేకపోతే టాక్సీ డ్రైవర్‌ అయిపోదాం అనుకున్నారు. కానీ ప్రతిభావంతులను వెండితెర వదలదు. 50, 100 రూపాయల కోసం రేడియోలో అనౌన్స్‌మెంట్లు చెబుతూ, సినిమాల్లో ట్రై చేస్తున్న అమితాబ్‌ని స్టార్‌ని చేయాలనుకుంది. 1969లో వచ్చిన జాతీయ అవార్డు సినిమా ‘భువన్‌ షోమ్‌’కి వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడంతో అమితాబ్‌ సినిమా కెరీర్‌ ఆరంభమైంది. అప్పుడే ‘సాత్‌ హిందుస్తానీ’ అనే సినిమాలో ఏడుగురిలో ఒక నటుడిగా అమితాబ్‌కి చాన్స్‌ వచ్చింది. వెండితెరపై తొలిసారి అమితాబ్‌ కనిపించిన సినిమా ఇది. ఇంటి పేరు ‘శ్రీవాస్తవ్‌’ అయినప్పటికీ తండ్రి కలం పేరుని ఇంటి పేరుగా చేసుకుని ‘అమితాబ్‌ బచ్చన్‌’ పేరుతో సినిమాల్లోకి వచ్చారు. అవకాశాలైతే వస్తున్నాయి కానీ వచ్చినవి వచ్చినట్లే థియేటర్‌ నుంచి వెళ్లిపోతున్నాయి. పైగా అమితాబ్‌ టీనేజ్‌లో ఏం ఎంటర్‌ కాలేదు. 30 ఏళ్ల వయసుకి దగ్గరపడుతున్న సమయంలో సినిమాల్లోకి వచ్చారు. ‘అసలా హైట్‌ ఏంటి? ఆ గొంతు ఏంటి? నటన వచ్చా?’... కెరీర్‌ స్టార్టింగ్‌లోనే విమర్శలు. దాంతో పాటు వరుసగా 12 ఫ్లాపులు. అమితాబ్‌కి అంతా చీకటిగా కనిపించింది. అయినా వెనక్కి వెళ్లిపోవాలనుకోలేదు.

ఆ సమయంలో వచ్చిన వెలుతురే ‘జంజీర్‌’. అమితాబ్‌ని స్టార్‌ని చేసిన సినిమా. ‘యాంగ్రీ యంగ్‌ మేన్‌’ అని టైటిల్‌ ఇచ్చిన సినిమా. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేనంత బిజీ నటుడిని చేసిన సినిమా.  ఆ తర్వాత వచ్చిన ‘దీవార్‌’, ‘షోలో’, ‘డాన్‌’ వంటి చిత్రాలతో అమితాబ్‌ కెరీర్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. కెరీర్‌ సాఫీగా సాగిపోతోంది. ఒంట్లో కావాల్సినంత ఓపిక ఉంది. ఇంకేముంది? అమితాబ్‌ కెరీర్‌ స్పీడ్‌ని ఎవరూ ఆపలేరనుకుంటున్న సమయంలో ‘కూలీ’ (1983) సినిమా అమితాబ్‌ని మరణం అంచుల వరకూ తీసుకెళ్లింది. ఆ సినిమా కోసం ఫైట్‌ సీన్‌ తీస్తున్నప్పుడు విలన్‌ పునీత్‌ నిస్సార్‌ పంచ్‌ అదుపు తప్పి అమితాబ్‌ కడుపుని బలంగా తాకింది. బిగ్‌ బి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. లోపల పేగు తెగింది. లోపల జరిగిన నష్టాన్ని గుర్తించని డాక్టర్‌ ఏదో చికిత్స చేశాడు. వేరే డాక్టర్‌ గ్రహించి, సరైన సమయంలో చికిత్స చేయడంతో అమితాబ్‌ బతికారు. ‘కూలీ’ చిత్రదర్శకుడు మన్‌మోహన్‌ దేశాయ్‌ నిజానికి సినిమాలో అమితాబ్‌ పాత్రను చంపేద్దామనుకున్నారు. కానీ నిజజీవితంలో బతికి బయటపడ్డ వ్యక్తిని సినిమాలో అలా చూపించడం ఆయనకు మనస్కరించలేదు. ఆ క్యారెక్టర్‌ని బతికించారు.

సినిమా సూపర్‌ హిట్‌ అయింది. అయితే అమితాబ్‌ ఆరోగ్యం పాడైంది. దాంతో దాదాపు మూడేళ్లు సినిమాలకు దూరంగా ఉండి, రాజకీయాల్లోకి వెళ్లారు. అక్కడా విజయమే. అయితే మనసంతా సినిమా పైనే. అందుకే వచ్చేశారు. ‘షెహన్‌షా’ (1988) వంటి సూపర్‌ హిట్‌తో మళ్లీ వెండితెరపై కనిపించారు. ఆ తర్వాత చేసిన ‘జాదూగర్‌’, ‘తూఫాన్‌’ వంటి సినిమాలు నిరాశపరిచాయి. సినిమాలు ఫ్లాప్‌ అయినా నటుడిగా ఫెయిల్‌ కాలేదు. 1990లో వచ్చిన ‘అగ్నిపథ్‌’ ఉత్తమ నటుడిగా అమితాబ్‌కి తొలి జాతీయ అవార్డుని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత చేసిన ‘ఖుదాగవా’ (1992)తో బచ్చన్‌ దాదాపు రిటైర్‌మెంట్‌ స్టేజ్‌కి వచ్చేశారు. అప్పుడే నిర్మాత కావాలనుకుని ‘ఎబీసీఎల్‌ కార్పొరేషన్‌’ మొదలుపెట్టారు. ‘తేరే మేరే సప్నే’ ఈ సంస్థ నుంచి వచ్చిన తొలి సినిమా. ఓ మోస్తరుగా ఆడింది. ఆ తర్వాత ఇదే బేనర్‌ మీద అమితాబే హీరోగా నటించి, నిర్మించిన ‘మృత్యుదాత’  (1997) ఫెయిలైంది. 1992 తర్వాత ఐదేళ్లకు అమితాబ్‌ తెరపై కనిపించిన సినిమా ఇది.

ఆర్థికంగా భారీ ఎత్తున నష్టపరచిన సినిమా. దాంతో పాటు ‘1996 మిస్‌ వరల్డ్‌ బ్యూటీ పెజెంట్, బెంగళూరు’కి ఏబీసీఎల్‌ స్పాన్సరర్‌గా చేయడం, అది కూడా నష్టాన్నే మిగల్చడంతో అమితాబ్‌ చివరికి ఎంతో కష్టపడి కట్టించుకున్న ‘ప్రతీక్ష’ (అమితాబ్‌ ఇంటి పేరు) ని అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే నిజాయతీగా కష్టపడి సంపాదించిన సొమ్ము మన దగ్గరే ఉంటుందట. అలా ‘ప్రతీక్ష’ను అమ్మకుండానే అమితాబ్‌ మెల్లిగా మెల్లిగా తన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో 2000లో కమిట్‌ అయిన టీవీ షో ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ అమితాబ్‌కి కోట్లు సంపాదించిపెట్టింది. అంత పెద్ద స్టార్‌ బుల్లితెర షో చేయడం ఇతర నటీనటులకు కూడా ఆదర్శం అయింది. సల్మాన్, ఆమిర్, షారుక్‌ వంటి ఖాన్‌ హీరోలు కూడా బుల్లితెరకు రావడానికి అమితాబ్‌ ఓ కారణం. ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు, యాడ్స్‌ చేస్తూ అమితాబ్‌ ఫుల్‌ బిజీ.

77 ఏళ్ల వయసులో రిటైర్‌మెంట్‌ స్టేజ్‌ దాటాక ఫుల్‌ బిజీగా ఉండే అవకాశం అమితాబ్‌లాంటి ఏ కొద్దిమందికో దక్కుతుంది. అమితాబ్‌ ఎన్నోసార్లు పడ్డారు. అంతే వేగంగా లేచి, నిలబడ్డారు. ప్రతిష్టాత్మక పురస్కారాలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌ ఆయన చెంత ఉన్నాయి. గుండెల్లో పెట్టుకుని చూసుకునే భార్య జయాబచ్చన్‌ ఉన్నారు. కొడుకు అభిషేక్‌ బచ్చన్, కోడలు ఐశ్వర్యా రాయ్, మనవరాలు ఆరాధ్య ఉన్నారు. కూతురు శ్వేతానంద, అల్లుడు నిఖిల్‌ నందా, మనవరాలు నవ్యా నవేలీ, మనవడు అగస్త్య ఉన్నారు. కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అమితాబ్‌కి ఇంకేం కావాలి? ‘‘ఎప్పటికీ నటించాలని ఉంది’’ అంటారు అమితాబ్‌. 77 ఏళ్ల జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, అనుకున్నవన్నీ సాధించిన అమితాబ్‌ ఈ ఆశ కూడా నెరవేరుతుంది.
అమితాబ్‌ బచ్చన్‌ నమ్ముకున్నది ఒక్కటే. ‘నిజాయతీగా కష్టపడటం’. ఆ నిజాయితీయే ఆయన్ను ‘సాహెబ్‌’ను చేసింది.

‘సైరా’లో...
అమితాబ్‌ ఈ ఏడాది తెలుగు స్క్రీన్‌పై పెద్ద పాత్రలో కనిపించనున్నారు. అదే ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా చిరంజీవి టైటిల్‌ రోల్‌లో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్‌ 2న ఈ చిత్రం విడుదల కానుంది.

మరిన్ని వార్తలు