మూవీ రివ్యూ : ‘అమ్మమ్మ గారిల్లు’

25 May, 2018 16:05 IST|Sakshi

టైటిల్ : అమ్మమ్మగారిల్లు
జానర్ : ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : నాగశౌర్య, షామిలి, రావు రమేశ్‌, శివాజీ రాజా, సుమిత్ర, సుధ, హేమ తదితరులు
సంగీతం : కళ్యాణ్‌ రమణ
దర్శకత్వం : సుందర్‌ సూర్య
నిర్మాత : రాజేశ్‌

ఛలో సినిమాతో సక్సెస్‌ అందుకున్న యువహీరో నాగశౌర్య. ఈ కుర్ర హీరో ఛలో లాంటి మాస్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ తరువాత తన తదుపరి చిత్రంగా కుటుంబ నేపథ్యంలో మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వేసవి సెలవుల్లో అందరూ అమ్మమ్మ గారింటికి వెళ్తారు. అయితే నాగశౌర్య ఈ వేసవిలో ‘అమ్మమ్మ గారిల్లు’కు వచ్చేలా చేశాడో లేదో తెలుసుకుందాం. 

కథ :
రంగారావు (చలపతి), సీతా మహాలక్ష్మి (సుమిత్ర) గారిది పిఠాపురంలో ఓ పెద్ద కుటుంబం. వీరికి ఐదుగురు సంతానం. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. పెద్ద కొడుకు (రావు రమేశ్‌) తండ్రిని ఆస్తి పంచమని అడుగుతూ ఉంటాడు. ఆస్తి కంటే అనుబంధాలు గొప్పవి, ఆస్తిని విడగొడితే అందరూ దూరమవుతారని కొడుక్కు నచ్చజెపుతాడు తండ్రి. కానీ బాబురావు(రావు రమేశ్‌) వినడు. అలా ఓసారి  జరిగిన గొడవలో ఆ ఇంటి పెద్దల్లుడు (సుమన్‌)ను చేయిజేసుకుంటాడు బాబురావు. ఆ అవమానంతో సుమన్‌ తన మామగారి కుటుంబానికి దూరంగా ఉంటారు. అల్లుడు గారికి జరిగిన అవమానం, కొడుకు ఆస్తి కోసం చేసే అల్లరితో చలపతి చనిపోతాడు. కొడుకులు, కూతుళ్లు అందరూ సీతామహాలక్ష్మిని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతారు. చిన్నప్పటి నుంచి సుమన్‌ కొడుకు సంతోష్‌ (నాగశౌర్య)కు మాత్రం అమ్మమ్మ అంటే చాలా ఇష్టం. అయితే ఈ గొడవలన్నింటికి కారణమైన ఆస్తిని ఎవరు పంచారు? ఎప్పుడు పంచారు? తిరిగి వీరంతా ఎలా కలుసుకుంటారు? వీటన్నింటికి హీరో చేసిన పనులేంటి అనేదే కథ.

నటీనటులు :
ఎప్పటిలాగే నాగశౌర్య అందంగా కనిపించాడు. నిజంగా ఇంట్లో మనవడిలా అనిపిస్తాడు. అమ్మమ్మ బాధల్ని తీర్చే మంచి మనవడిగా, కుటుంబాన్ని కలిపే పెద్దమనిషిగా నటిస్తూ మెప్పించాడు. షామిలీ ఓయ్‌ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినా... మళ్లీ ఇన్నేళ్ల తరువాత ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. తన పాత్ర మేరకు ఉన్నంతలో అందంగానూ కనిపించారు. ప్రేక్షకులకు నచ్చేలాను నటించారు. రావు రమేశ్‌ నటనకు పేరు పెట్టలేం. మళ్లీ తన విశ్వరూపాన్ని చూపించారు. (సాక్షి రివ్యూస్‌) నాగశౌర్య తరువాత ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రావు రమేశ్‌ పాత్ర గురించే. ఇలాంటి పాత్రల్లో నటించడం ఆయనకు కొత్తేంకాదు. అమ్మమ్మగా చేసిన సుమిత్ర కంటతడి పెట్టించారు. మిగతా పాత్రల్లో శివాజీ రాజా, హేమ, షకలక శంకర్‌, సుధా, సుమన్‌ అందరూ తమ పరిధి మేరకు నటించారు. 
 

విశ్లేషణ :
అమ్మమ్మ గారిల్లు అని టైటిల్‌ చూసిన ప్రతి ఒక్కరికి కథేంటో అర్థమైపోతుంది. అయితే ఇలా అందరూ ఊహించే కథే అయినా.. సరిగా ప్రజెంట్‌ చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మిన దర్శక నిర్మాతల గురించి మొదట చెప్పుకోవాలి. కొన్ని పదునైన మాటలతో మనసును తాకేలా చేశారు డైరెక్టర్‌ సుందర్‌ సూర్య. తులం బంగారం కాదు గుణం బంగారం కావాలి లాంటి మంచి మాటలు సినిమాలో బాగానే ఉన్నాయి. బరువైన బంధాలను అంతే బరువైన సంభాషణలతో నడిపించాడు. కథలో ఏ మాత్రం కొత్తదనం కనపడకపోయినా... కథకు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌ వర్కౌట్‌ అయ్యేలా ఉంది. సెకండాఫ్‌లో ‘లాక్‌ ది ఏజ్‌’ అనే ఎపిసోడ్‌ కాసేపు నవ్వించి, కాసేపు ఏడిపించేసింది. ఆ ఎపిసోడ్‌ సినిమాకు కలిసొచ్చే అంశమే. (సాక్షి రివ్యూస్‌) ఈ విషయాల్లో డైరక్టర్‌ సక్సెస్‌ సాధించారు. తరువాతి అంశంగా సంగీతం గురించి చెప్పుకోవాలి. హీరోకు, హీరోయిన్‌కు అనవసరమైన ఇంట్రడక్షన్‌ సాంగ్స్‌ పెట్టకుండా.. ఉన్న రెండు మూడు పాటలు కూడా అలా కథతో పాటు వచ్చి వెళ్తాయి. రసూల్‌ అందించిన సినిమాటోగ్రఫీలో హీరో హీరోయిన్లు అందంగా కనిపించారు. ఎడిటింగ్‌ కూడా బాగానే ఉంది. నాలుగు ఫైట్లు, ఐదు పాటలు, ఆరు మాస్‌ డైలాగ్‌లు లాంటి సినిమా కాదిది. ఈ బిజీ లైఫ్‌లో మనం ఏం కోల్పోతున్నామో తెలుసుకోవాలంటే.. చూడాల్సిన సినిమా. అయితే రెగ్యులర్‌ మాస్‌ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్‌ చేసుకుంటారో చూడాలి.

బలాలు : 
నాగశౌర్య, రావు రమేశ్‌ నటన 
సంగీతం 
కొన్ని డైలాగ్‌లు

బలహీనతలు :
కథలో కొత్తదనం లోపించడం

ముగింపు : ఈ వేసవి సెలవుల్లో ‘అమ్మమ్మ గారిల్లు’ ను ఓసారి వెళ్లిచూడొచ్చు. 

- బండ కళ్యాణ్‌, ఇంటర్నెట్‌ డెస్క్‌

Poll
Loading...
మరిన్ని వార్తలు