అలా చేయొద్దని తాత చెప్పారు: హీరో

6 Nov, 2019 11:24 IST|Sakshi

తన తాతయ్య అమ్రిష్‌ పురి చెప్పిన మాటలు తనకు పవిత్ర గ్రంథంతో సమానమని బాలీవుడ్‌ హీరో వర్ధన్‌ పురి అన్నాడు. నటనను ఒక వృత్తిలా భావించాలే తప్ప స్టార్‌ని అనే గర్వం తలకెక్కించుకోవద్దని తనకు సూచించినట్లు పేర్కొన్నాడు. అదే విధంగా మూలాలు మర్చిపోకూడదని.. జయాపజయాలు సమానంగా స్వీకరించినపుడే జీవితంలో ముందుకు సాగుతామన్న అమ్రిష్‌ పురి మాటలను గుర్తుచేసుకున్నాడు. తనదైన విలనిజంతో బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా అలరించిన దివంగత నటుడు అమ్రిష్‌ పురి... మనుమడు వర్ధన్‌ పురి ‘యే సాలీ ఆషికీ’  అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేస్తున్నాడు. చిరాగ్‌ రూపారెల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అమ్రిష్‌ పురి ఫిల్మిమ్స్‌, పెన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రొమాంటిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాతో శివలేఖ ఒబేరాయ్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. కాగా మంగళవారం రిలీజ్‌ అయిన ఈ మూవీ ట్రైలర్‌ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లలో భాగంగా వర్ధన్‌ పురి మాట్లాడుతూ... ‘ నేను థియేటర్‌ ఆర్టిస్టుని. ఇప్పుడు సినిమాల్లోకి వస్తున్నాను. నిజానికి జయంతీలాల్‌ గడా పీరియాడిక్‌ డ్రామాతో తెరంగేట్రం చేయాల్సింది. కానీ యే సాలీ ఆషికీ కథ బాగా నచ్చడంతో వెంటనే చిరాగ్‌కు ఓకే చెప్పాను. మా కుటుంబం మొత్తం నటులన్న విషయం తెలిసిందే. తాతయ్య నాకు ఎన్నో సలహాలు ఇచ్చేవారు. థియేటర్‌ ఆరిస్టుగా చేసి సినిమాల్లోకి వెళ్లిన తర్వాత చాలా మంది పార్టీ కల్చర్‌ అంటూ చెడిపోతారు... వింతగా ప్రవర్తిస్తారు.. నువ్వు అలా ఉండకూడదు. మూలాలు మర్చిపోకుండా ఉన్నపుడే కెరీర్‌లో ముందుకు సాగుతాం అని నాకు చెప్పారు. ఆయన మాటలే నాకు బైబిల్‌. ఆయన స్పూర్తితో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటా అని చెప్పుకొచ్చాడు. కాగా కొత్త నటీనటులతో తెరకెక్కుతున్న ‘యే సాలీ ఆషికీ’ నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.  

>
మరిన్ని వార్తలు