చిత్రజగత్తులో అనంతం

22 Sep, 2019 11:19 IST|Sakshi

సాక్షి, అనంతపురం: ‘సాహో’ చిత్రం విడుదలకు ముందు చిత్రపరిశ్రమ అంతా అనంత వైపు ఆసక్తిగా చూసింది. తెలుగు చలనచిత్ర చరిత్రలోనే రికార్డులు సృష్టిస్తూ రూ.350 కోట్లతో నిర్మాణమవుతూ అందరిలో భారీ అంచనాలను పెంచేసిన ఈ చిత్రం ఈ జిల్లా వాసి చేతుల మీదుగా పురుడు పోసుకోవడమే ఇందుకు కారణం. ఈ క్రమంలో సుజిత్‌ దర్శక ప్రస్థానానికి పునాదులేసిన అనంతలోనే ఎందరో కళాకారులు చలన చిత్ర పరిశ్రమల అభివృద్ధిలో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. జిల్లాకు విశేష ఖ్యాతి తెచ్చిన ప్రపంచ ప్రఖ్యాత రంగస్థల నటుడు బళ్లారి రాఘవ.. కొద్దికాలం కొన్ని సినిమాలు చేసినా.. విలువలు లేని చిత్రరంగం వద్దని రంగస్థలంలోనే  కొనసాగారు. ఆయన స్ఫూర్తి మరెందరికో మార్గదర్శకమైంది. చిత్రసీమ ‘విజయ’ కిరీటంలో కలికుతురాళ్లుగా మారి తిరుగులేని ఖ్యాతిని గడించిన జిల్లా వాసులు ఎందరో ఉన్నారు. అదే చిత్రసీమలో ఇమడలేక నాలుగైదు సినిమాలతో వచ్చేసిన వారూ ఉన్నారు.. పోరాటమే ఊపిరిగా కొనసాగుతున్న వారూ ఉన్నారు.. ఒక్కచాన్సు అంటూ చిత్రరంగాన్ని ఏలేందుకు కలలు కంటున్న వారు..  ఆ కలను సాకారం చేసుకుంటున్న వారూ ఉన్నారు. వీరందరి ఆసక్తికర జీవిత విశేషాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

సాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ అంటే చెన్నై, హైదరాబాదు, విశాఖపట్నం వంటి నగరాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో అనంత వాసులు చాలా మంది ఉన్నారంటే ఎవరికైనా ఆసక్తికరంగానే ఉంటుంది. నాటి మూలా నారాయణస్వామి మొదలు నేటి సుజిత్‌రెడ్డి వరకు ఎంతో మంది అనంత వాసులు చిత్ర పరిశ్రమకు నీరాజనాలర్పించారు. తెలుగు సినిమాకు శ్రీకారం చుట్టి , ప్రాకారం నిర్మించి,  ఆకారం తీర్చిదిద్దిన ఇక్కడి కళాకారుల్లో  నిర్మాత మూలా నారాయణస్వామి, సుప్రసిద్ధ దర్శకుడు కేవీ రెడ్డి పేర్లను ముందుగా స్మరించుకోవాలి. తెలుగు చిత్ర పరిశ్రమ నెమ్మదిగా ప్రారంభమైన నాటి రోజుల్లోనే ఇక్కడి వారు తమ ప్రతిభా పాటవాలతో విశేషంగా ఆకట్టుకున్నారు.

దిగ్గజ దర్శకులు జిల్లాకే సొంతం
కేవీరెడ్డి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన అసలు పేరు కదిరి వెంకటరెడ్డి, ఆయన దర్శకత్వం వహించిన భక్తపోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పెద్ద మనుషులు, పాతాళబైరవి, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, పెళ్లినాటి ప్రమాణాలు, జగదేకవీరుని కథ, శ్రీకృష్ణసత్య...  ఇలా ఆయన తీసిన ప్రతి చి త్రం తెలుగు సీమను పులకరింపజేసింది. జిల్లాపై అభిమానంతో ఆయన చాలా సినిమాలు తాడిపత్రి పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్‌ చేయడం గమనార్హం. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో ఛాయాగ్రాహకుడిగా ఖ్యాతి గడించిన వీఎన్‌రెడ్డి కూడా అనంతపురం వారే. ఇక హీరో రామాంజినేయులు ‘నాదే గెలుపు’ సినిమా చేసి తన ఇంటి పేరునే హీరోగా మార్చేసుకున్నారు. ‘ఇది సినిమా కాదు’, ‘పెళ్లి సంబంధాలు’ తీసిన నారాయణరెడ్డి కూడా ఇక్కడి వారే.

రాయదుర్గానికి చెందిన వెంకటేశ్వరప్ప తన మిత్రులతో కలిసి ‘జీవితాశయం’, ‘దేవదాసు మళ్లీ పుట్టాడు’ చిత్రాలు తీశారు. హిందూపురానికి చెందిన రాజగోపాలయ్య ‘డేంజర్‌ లైట్‌’, కదిరికి చెందిన సుందరం ‘యుగధర్మం’, నారాయణరావు అనే వ్యక్తి ‘మొదటిరాత్రి’ అనే సినిమాలను నిర్మించారు. అదేకోవలో మరికొంత మంది సినిమాలు తీశారు కానీ ఆర్ధిక ఇబ్బందుల వల్ల వాటని విడుదల చేయలేకపోయారు. అనంతతో పాటు ధర్మవరం, కళ్యాణదుర్గం, పామిడి, ముదిగుబ్బ, నల్లచెరువు తదితర ప్రాంతాలకు చెందిన వారు డిస్ట్రిబ్యూటర్లుగా, ఫైనాన్షియర్లుగా మారి చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించారు. ముఖ్యంగా గుంతకల్లు లాంటి చోట్ల పంపిణీ సంస్థలు వెలసి సీడెడ్‌ పేరుతో చిత్రసీమకు ఒక వెలుగును పంచాయి.

వన్నూరు మాస్టర్‌ 
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కోరియోగ్రాఫర్‌గా వన్నూరు మాస్టర్‌ మినహా జిల్లాకు చెందిన మరెవరూ లేరంటే అతిశయోక్తి కాదు. ‘నీ ఊహల్లో నేనుంటా’, ‘కిరీటం’ సినిమాలకు ఆయన నృత్యదర్శకత్వం వహించారు. ప్రస్తుతం బీజీ (బడుగు జీవులు) సినిమాకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. నగరంలోని కెనరా బ్యాంకులో పనిచేస్తూనే తీరిక వేళల్లో సినిమాలు చేస్తుండే వన్నూరుమాస్టర్‌ ఇటీవలే పెద్ద ఈవెంట్‌ చేసి అందరి దృష్టి ఆకర్షించారు.

ఇద్దరూ ఇద్దరే
నగరంలోని ఆదిమూర్తినగర్‌కు చెం దిన రాజురాజేంద్ర, ఆనంద్‌ అన్నదమ్ములు. ఇద్దరూ ఆర్ట్స్‌ కాలేజ్‌లో చదువుకున్నారు. ఇద్దరూ చిత్రపరిశ్రమలో దర్శకులుగా స్ధిరపడ్డారు.  ‘కొంచం కొత్తగా’, ‘ ప్రతిరోజు’ (రవిబాబు హీరోగా) చిత్రాలు అన్న నిర్మించగా, తమ్ముడు ఆనంద్‌ హైదరాబాదు గొప్పతనాన్ని చాటే అనేక ఉర్దూ సినిమాలు తీస్తున్నారు. అవి రాష్ట్ర, జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన 1847 సీరియల్‌కు నంది అవార్డు దక్కింది. ఆ సీరియల్‌ కథాంశం ఆధారంగానే చిరంజీవి సైరా సినిమా వస్తోంది.

సంగీత కెరటం శ్రీనిధి
నగరంలోని మొదటిరోడ్డుకు చెందిన సంగీత విద్వాంసుల కుమార్తె శ్రీనిధి.. తన మూడేళ్ల ప్రాయంలోనే సంగీత స్వరాలను గుర్తుపట్టి ప్రపంచ రికార్డు దక్కించుకున్నారు. పాడుతా తీయగా ఎపిసోడ్‌ విన్నర్‌గా నిలచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు సినీ సంగీత దిగ్గజాలనందరినీ ఆకట్టుకున్నారు. ఎన్నో సినిమాలకు నేపథ్య గాత్ర సహకారమందించా రు. ఇటీవల సంచలనం సృష్టించిన బాహుబలి చిత్రంలో ‘కన్నా నిదురించరా’ పాటతో అందరి దృష్టి జిల్లా వైపు పడేలా చేశారు.

వెంకటకృష్ణ
జిల్లా కేంద్రంలోని అరవిందనగర్‌కు చెందిన శ్రీనివాసమూర్తి, సుశీలమ్మ దంపతుల కుమారుడే వెంకటకృష్ణ. ‘భలే పోలీసు’, ‘కిరీటం’, ‘గల్లీఫైటర్‌’ సినిమాలు చేశారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. సీనియర్‌ ఎన్టీఆర్, గిరిబాబు, రఘుబాబు, ఆలీతో కలిసి అనేక సినిమాల్లో ఆయన నటించారు. ఇదే కోవకు చెందిన వారు వరం వెంకటేశ్వర్లు. ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీసర్‌గా ప్రస్తుతం హైదరాబాదులో ఆయన పనిచేస్తున్నారు. శ్రీ శూలినీ దుర్గా ప్రొడక్షన్స్‌ పేరుపై వెంకటేశ్వర్లు సినిమాలు తీస్తుంటారు. నిర్మాతగా చెన్నై చిన్నోడు, ఐశ్వరాభిమస్తు సినిమాలను వెండి తెరకెక్కించారు. కిరీటం సినిమాలో తన నటనా కౌసలాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా నాటి తరం నటీనటులు అంజలీ దేవి, కాంతారావు, పద్మనాభం, జమున, కృష్ణకుమారి, మాడా వేంకటేశ్వరరావు, తొలి నేపథ్యగాయని రావు బాలసరస్వతిని జిల్లాకు పరిచయం చేసిన ఘనత వెంకటేశ్వర్లుదే.

ఘటికాచలం
యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిన స్టోరీ రైటర్, దర్శకుడు ఘటికాచలం.. తన చిన్నప్పుడు నగరంలోని మొదటి రోడ్డులో ఉన్న పొట్టి శ్రీరాములు స్కూల్లో చదువుకున్నారు. 1998లో ‘ప్రేమపల్లకి’ ముత్యాలసుబ్బయ్య సినిమా ‘జీవించండి’ ‘సంపంగి’ చిత్రాలకు కథ, మాటలు అందించారు.  మందారం, ప్రేమలో పావనీ కళ్యాణ్‌ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు 40 సినిమాలు చేశారు.

శ్రీధర్‌చౌదరి
నగరానికి చెందిన హను మంతప్ప, రామాంజనమ్మ దంపతుల కొడుకు  శ్రీధర్‌ చౌదరి. నిర్మాతగా జశ్వం త్‌ ఆర్ట్స్‌ పతాకంపై శివాజీ, సింధూ తలానీ హీరోహీరోయిన్లుగా ‘నీ నవ్వే చాలు’ శివాజీ, కృష్ణభగవాన్‌ ప్రధాన పాత్రల్లో  ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమాలు ఆయన నిర్మించారు. ప్రస్తుతం అతని కొత్త సినిమా నిర్మాణంలో ఉంది.

తిరుపతి ప్రకాష్‌ 
జిల్లా కేంద్రంలో చదువుకున్న తిరుపతి ప్రకాష్‌ రెండు రాష్ట్రాల తెలుగువారి హృదయాల్లో హాస్య నటుడిగా ముద్ర వేసుకున్నారు. దాదాపు వందకు పైగా సినిమాలలో ప్రాధాన్యత ఉండే పాత్రల్లో నటించి, మెప్పించారు. అగ్ర కథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌తో పాటు ఇప్పటి హీరోలతోనూ కలిసి నటిస్తున్నారు.

మురళీధర్‌
నగరానికి చెందిన మురళీధర్‌ ఎల్‌ఐసీలో పనిచేస్తుంటారు. 2009లో కిరీటం సినిమాతో ఆరంభమైన ఆయన నట జీవితం మహానగరంలో శివ, చందు, అమ్మ మాట కోసం, పోస్టర్స్‌ తదితర చిత్రాలతో కొనసాగుతూ వస్తోంది. దాదాపు 50 లఘుచిత్రాలలో నటించి అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

ప్రియాంక జవల్కర్‌
భావసార క్షత్రియ సంతతికి చెందిన ప్రియాంక జవల్కర్‌.. అనంతపురం వాసినే. జిల్లా కేంద్రంలోని ఓ టైలర్‌ షాప్‌ యజమాని ముద్దుల పట్టి. ఇక్కడే బీటెక్‌ పూర్తి చేశారు. లఘు చిత్రాల ద్వారా వెండి తెరకు ఆమె పరిచయమయ్యారు. ఇటీవల వచ్చిన టాక్సీవాలా సినిమాలో హీరోయిన్‌గా తన నటనతో యావత్తు చిత్రపరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం కొత్త ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తోంది.

గురుచరణ్‌ 
నగరంలోని తపోవనానికి చెందిన సుధాకరమూర్తి, బృంద దంపతుల కుమారుడు గురు చరణ్‌. 2009లో యూఎస్‌ఏలో చదువు పూర్తి చేసుకుని తిరిగి వచ్చారు. అప్పటి నుంచి సినిమాలలో అడపాదడపా నటిస్తూ వచ్చారు. అగ్నిపూలు, మనసు మమత,, గోకులంలో సీత వంటి సీరియల్స్‌లో మంచి నటుడిగా పేరు రావడంతో టెర్రర్, గాయకుడు, బాయ్, తుమ్మెద, రాజా ది గ్రేట్, భరత్‌ అనే నేను, హృదయ కాలేయం, కొబ్బరి మట్ట తదితర అనేక చిత్రాల్లో నటించారు.

రషీద్‌బాషా 
ఫిల్మ్‌ మేకింగ్‌పై ఫ్యాషన్‌తో హైదరాబాదుకు వెళ్లి దాదాపు 18 ఏళ్లు వివిధ విభాగాలలో సినిమాల్లో పనిచేశారు. ఆ అనుభవంతో దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ ‘లిటిల్‌ స్టార్స్‌’ సినిమాను 2016లో తీశారు. ఆయన శిష్యబృందం కూడా సినిమాల్లో పనిచేస్తున్నారు. ఇటీవలే జిల్లా చరిత్రను ప్రతిబింబిస్తూ తీసిన ‘అనంత వైభవం’ లఘుచిత్రానికి టూరిజం బెస్టు సినిమా అవార్డు దక్కింది. మురళీగానం పేరుతో వచ్చిన జిల్లా రచయిత్రుల జీవితాలను బుల్లితెరకెక్కించే పనిలో ఆయన తలమునకలుగా ఉన్నారు. లిటిల్‌సోల్జర్స్‌ సినిమాలో ఏకంగా 56 మంది జిల్లా వాసులను ఆయన పరిచయం చేశారు.

మనేరి రమేష్‌
వివిధ చానల్స్‌లో ప్రసారమయ్యే సీరియల్స్‌ చూస్తున్నప్పుడు అడపాదడపా మనేరి రమేష్‌ కనిపిస్తుంటారు. నగరంలోని నీటిపారుదల శాఖలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. తీరిక వేళల్లో అనేక సినిమాలు, సీరియల్స్, ఈవెంట్స్‌ చేస్తుంటారు. ‘అపరిచితుడు’ ఫేమ్‌ విక్రమ్‌తో కలిసి 1997 నాటికే యూత్‌ సినిమా చేశారు. సానాయాదిరెడ్డి ‘బ్యాచిలర్స్‌’ కాలేజ్, దాసరినారాయణరావు ‘చిన్నా’, ఎస్వీ కృష్ణారెడ్డి ‘సకుటుంబ సపరివార సమేతంగా’ సినిమాలలో నటించారు. బాహుబలి చిత్ర దర్శకుడు రాజమౌళి ఒకప్పుడు చానల్స్‌లో పనిచేస్తున్నపుడు తీసిన ‘శాంతి నివాసం’ సీరియల్‌లో ప్రధాన పాత్రలో రమేష్‌ నటించారు. పలు చానల్స్‌లో ప్రసారమయ్యే ఎపిసోడ్‌లకు యాంకర్‌గాను రక్తికట్టిస్తుంటారు.

రంగనాథం
హిందూపురానికి చెందిన రంగనాథం, రమాదేవి ఇద్దరూ హెడ్మాస్టర్లుగా పనిచేశారు. వారి కుమారుడు రంగనాథం అనేక సినిమాలు చేశా రు. ‘అరవింద సమేత, దయ్యం, పవిత్రబంధం, పెళ్లి’ సినిమాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటి వరకు 40 సినిమాల్లో నటించారు. లేపాక్షిలో చదువుకున్న ఆయన ప్రస్తుతం మహేష్‌ బాబు సినిమాలో నటిస్తున్నారు.

అమర్‌దీప్‌ 
నగరానికి చెందిన సీనియర్‌ డాన్స్‌ మాస్టర్‌ అమీర్‌బాషా కుమారుడు అమర్‌దీప్‌. వర్ధమాన నటుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. పరిణయం, సిరిసిరిమువ్వలు వంటి  సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో ఆయన నటిస్తున్నారు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి.. భూకైలాస్‌ సినిమా నిర్మించారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు మహాలక్ష్మీ శ్రీనివాస్‌ కుమారుడు రవి కూడా రెండు సినిమాలు చేస్తున్నారు. అవి విడుదల కావాల్సి ఉంది.

మధు 
గుత్తికి చెందిన మధు... రచయితగా, యాక్టర్‌గా తెలుగు చిత్రపరిశ్రమలో కొనసాగుతున్నారు. అనంతపురంలోని ఎస్‌ఎస్‌బీఎన్‌లో చదువుకున్న ఆయన 2001లో ఆర్టిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘ఆ నలుగురు, పెళ్లయిన కొత్తలో, గుండె ఝల్లుమంది, సీతారాముడు, మన కుర్రాళ్లే, కెవ్వుకేక’ తదితర సినిమాల్లో నటించారు. యాక్సిడెంట్, రక్తచరిత్ర, లైఫ్‌ ఈజ్‌ బ్యూటీఫుల్, ఉందిలే మంచి కాలం ముందుముందునా సినిమాలకు స్టిల్‌ కోఆర్డినేటర్‌గా పనిచేశారు. ‘మిస్టర్‌ పెళ్లికొడుకు, కాఫీ విత్‌ మై లైఫ్‌’ సినిమాల్లోనూ కనిపిస్తారు.

చలన చిత్ర పరిశ్రమలో మరికొందరు జిల్లా వాసులు 
నటి హరితేజ.. అనంతపురంలోనే కొన్నేళ్లు చదువుకున్నారు. శాస్త్రీయ నృత్యం ఇక్కడే నేర్చుకున్నారు. ఇటీవల బిగ్‌బాస్‌లో హల్‌చల్‌ చేస్తున్నారు.  
నగరానికి చెందిన నవీద్‌ ‘భలే మంచి చౌక భేరం’ సినిమాలో నటించి పేరు తెచ్చుకున్నారు.  
అనంతలక్ష్మి ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌ అనంతరాముడు ఇటీవలే ‘2 ఫ్రెండ్స్‌’ సినిమా నిర్మించారు. ప్రస్తుతం మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు.  
జర్నలిస్టు సంఘం నాయకుడు మచ్చా రామలింగారెడ్డి ‘షిరిడిసాయి ప్రత్యక్ష దైవం’ సినిమాలో బాబా పాత్రలో నటించారు. సినిమా విడుదల కావాల్సి ఉంది. అంతకు ముందు ఓ టీవీ చానల్‌లో ఆయన నటించిన బాబా పాత్రకు నంది అవార్డు దక్కింది.
► జానపద, బంజారా సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్న మంగ్లీ అనంతపురంలోనే చదువుకున్నారు. 
హిందూపురానికి చెందిన నాగరాజు మేకప్‌మెన్‌గా స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలలో హీరో హీరోయిన్లతోపాటు క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు మేకప్‌ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. 
► ధర్మవరానికి చెందిన పురంధరదాసు దర్శకులుగా, బత్తలపల్లికి చెందిన మల్లికార్జున, తాడిపత్రికి చెందిన నాగేశ్వరరెడ్డి నిర్మాతలుగా చిత్రాలు తీస్తున్నారు.   

అవకాశాలను వెతికి తెచ్చుకోవాలి 
చాలా మందికి టాలెంటు ఉంటుంది. కానీ అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలో తెలియక అన్నీ జారివిడుచుకుంటారు. ప్రతిభ అంతంత మాత్రంగా ఉన్నా ఎక్కువ సినిమాలు చేయాలని ఆశపడుతుండేవారు ఎక్కువ మందే ఉన్నారు. టాలెంటును నిరూపించుకుంటే ఆ తర్వాత పరిశ్రమే వెంట పడుతుంది. క్యారెక్టర్‌ చిన్నది కదా అని చాలా మంది జిల్లా వాసులు సినిమాలలో ఉత్సాహంగా నటించడం లేదు. గట్టిగా ప్రయత్నిస్తే అందుకోలేని విజయం అంటూ ఏదీ ఉండదు.  
– రమేష్, సినీ యాంకర్, నటుడు

మరిన్ని వార్తలు