పుకార్లను పట్టించుకోవడం మానేశా

9 Aug, 2019 02:25 IST|Sakshi

‘‘ఎంబీఏ పూర్తి చేశాక ఉద్యోగం చేస్తున్న టైమ్‌లో పెళ్లి కుదిరింది. అప్పుడు ఉద్యోగం నుంచి బ్రేక్‌ తీసుకున్నప్పుడు ఓ యాడ్‌ చేశా. ఆ తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌ చేస్తున్నప్పుడు సినిమాల్లో నటించమని అవకాశాలొచ్చాయి. కానీ, మా పేరెంట్స్‌ ఒప్పుకోలేదు. పెళ్లి తర్వాత నా భర్త భరద్వాజ్‌ సపోర్ట్‌గా ఉండటం వల్లే ఈ స్థాయిలో ఉన్నా’’ అన్నారు అనసూయ. ‘క్షణం, రంగస్థలం’ వంటి హిట్‌ చిత్రాల్లో కీలక పాత్రలు చేసిన అనసూయ లీడ్‌ రోల్‌ చేసిన చిత్రం ‘కథనం’. రాజేష్‌ నాదెండ్లను దర్శ కత్వంలో బి.నరేంద్రరెడ్డి, శర్మ చుక్కా నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అనసూయ పంచుకున్న విశేషాలు.

► నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతోంది. హీరోయిన్‌ కావాలనుకోలేదు. నాకు లీడ్‌ రోల్‌ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదు. లీడ్‌ రోల్‌ అన్నది ఓ బాధ్యత కూడా. ‘రంగస్థలం’ సినిమాలో డైరెక్టర్‌ సుకుమార్‌గారు చెప్పింది చేశా. ‘కథనం’ సినిమాలోనూ అంతే. దర్శకుడు చెప్పింది చేశా.

► ‘రంగస్థలం– కథనం’ సినిమాలకి మధ్యలో దాదాపు 13 కథలు విన్నా. కొన్ని కథలు నచ్చకపోవడం ఓ కారణం.. కొత్త ప్రొడక్షన్‌ కంపెనీలు కావడంతో సినిమాని విడుదల చేస్తారో? లేదో? అనే మరో కారణంతోనూ చేయలేదు. ఓ సినిమా కోసం ఎంతో కష్టపడతాం. చేసిన పనికి గుర్తింపు రాకపోతే నేను ఒత్తిడికి లోనవుతా.

► రాజేష్‌కి ‘కథనం’ తొలి సినిమా అయినా చక్కగా తీశాడు. నా కోసమే ఈ కథ రాశాడేమో అనిపిస్తోంది. ఈ చిత్రంలో అను అనే అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్ర నాది. డైరెక్టర్‌ కావాలని కథలతో నిర్మాతలను కలుస్తూ ఇబ్బందులు పడుతుంటా. నేను రాసుకున్న ఓ కథ ప్రకారమే రెండు హత్యలు జరుగుతాయి. వాటిపై జరిగే విచారణ ఆసక్తిగా ఉంటుంది.

► నటిగా ఉండటం అదృష్టం.. దౌర్భాగ్యం కూడా. సోషల్‌ మీడియాలో నా గురించి రకరకాల పుకార్లు వస్తుంటాయి. వీటి గురించి మా ఇంట్లో వాళ్లు అస్సలు బాధపడరు.. మొదట్లో నేనే బాధపడేదాన్ని. ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాను. నాకు ‘బిగ్‌బాస్‌’లో అవకాశం వచ్చింది. కానీ, నా కుటుంబానికి నేను బానిస అయిపోయా. వారిని వదిలి అన్ని రోజులు ఉండలేననే చేయలేదు.  

► ∙‘క్షణం’ నటిగా ధైర్యం ఇచ్చింది. ‘రంగస్థలం’ని కన్నడ, తమిళ్, మళయాళంలో డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు. ఆ చిత్రం రిలీజ్‌ తర్వాత ఆ భాషల నుంచి అవకాశాలు వచ్చాయి కానీ చేయలేదు. ప్రస్తుతం ఓ సినిమాలో సెకండ్‌ లీడ్‌ రోల్‌ చేస్తున్నా. మరో సినిమాలోనూ నటిస్తున్నాను.

మరిన్ని వార్తలు