జీఎస్టీ సోదాలు.. స్పందించిన సుమ, అనసూయ

22 Dec, 2019 12:57 IST|Sakshi

ప్రముఖ యాంకర్లు సుమ, అనసూయ ఇళ్లలో జీఎస్టీ అధికారులు సోదాలు చేపట్టారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై సుమ, అనసూయలు వేర్వేరుగా స్పందించారు. తమ ఇళ్లపై సోదాలు జరిగాయని వస్తున్న వార్తలను వారు ఖండించారు. అందులో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సుమ ఇన్‌స్టాలో ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. అనసూయ కూడా తప్పుడు వార్తలు ప్రచురించడంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

‘సుమ ఇంటిపై జీఎస్టీ దాడులు జరిగాయని వస్తున్న వార్తలు నిరాధారమైనవి. నేను చాలా ప్రాంప్ట్‌గా జీఎస్టీ చెల్లిస్తున్నాను. అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయి. ఇలాంటి గాసిప్స్‌ నేను ఖండిచకపోతే.. పది మంది నోళ్లలో నాని అదే నిజం అవుతుంది.. అందువల్లే నేను ఖండిచాల్సి వచ్చింది. వీటిని నమ్మకండి’  సుమ తెలిపారు. ‘ఇతరుల జీవితాలను బేస్‌ చేసుకుని తప్పుడు వార్తలను సృష్టించడానికి కొందరు ఇష్టపడతారు. వార్తల్లోని వాస్తవాలు తెలుసుకోకుండా మీడియా సంస్థలు కూడా వాటిని ప్రసారం చేయడం విచారకరం. నకిలీ వార్తల వల్ల వారికి కలిగే నష్టాన్ని ఒక్కసారి ఊహించుకోండి. మనుషులు ఎందుకు మానవత్వాన్ని మార్చిపోతున్నారు?. ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించడం కూడా ఒక నేరం. దయచేసి ఒకరి గురించి ఏదైనా వార్తను ప్రచురించే ముందు వాటిని ఒక్కసారి నిర్ధారణ చేసుకోవాలి’ అని కోరారు. 

ఊహజనితమైన కథనాలకు అస్కారం ఇవ్వకూడదు : అనసూయ
‘వాస్తవం తెలిసిన తర్వాత అర్థం చేసుకోవడం చాలా సులువైన పని.. కానీ వాస్తవం కనుగోనడమే ఇక్కడ సమస్య’  అని అనసూయ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని తన ఇంటిపై కానీ, తనకు చెందిన స్థలాలపై ఎటువంటి సోదాలు జరగలేదని స్పష్టం చేశారు. మీడియా అనేది సమాచారం ఇవ్వాలి.. కానీ ఊహజనితమైన కథనాలు, వ్యక్తిగత అభిప్రాయాలను అస్కారం ఇవ్వకూడదు. వినోద రంగంలో మంచి పేరు, గౌరవం తెచ్చుకోవడానికి తాము చాలా కష్టపడ్డామని తెలిపారు. మీడియా చాలా శక్తివంతమైనదని పేర్కొన్న అనసూయ.. సమాజానికి మంచి చేయడం దృష్టి సారించాలని సూచించారు. కష్టపడి పైకొచ్చిన వ్యక్తులను అనవసరంగా ఇబ్బందులకు వ్యవహరించకూడదన్నారు. ఏదైనా వార్తను ప్రసారం చేసే ముందు అందులోని వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. 

All truths are easy to understand once they are discovered.. the point is to discover them. 🙏🏻

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

>
మరిన్ని వార్తలు