‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’కు ఏపీ ప్రేక్షకులు !

31 Mar, 2019 07:30 IST|Sakshi
సత్తుపల్లి బాలాజీ థియేటర్‌లో ఆంధ్రా నుంచి వచ్చిన అభిమానులు

సత్తుపల్లి: ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని చూసేందుకు ఏపీ నుంచి ప్రేక్షకులు సత్తుపల్లికి వస్తున్నారు. స్థానిక బాలాజీ థియేటర్‌లో ప్రదర్శితమవుతున్న ఈ సినిమా చూసేందుకు శనివారం ఏపీ నుంచి ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాలేదు. దీంతో, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినట్టు ‘సాక్షి’తో ప్రేక్షకులు చెప్పారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాన్ని ఈ సినిమాలో దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చాలా చక్కగా చిత్రీకరించారని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా సీతానగరం, చింతంపల్లి, జంగారెడ్డిగూడెం, లింగగూడెం, కృష్ణా జిల్లా తిరువూరు, నూజివీడు, విస్సన్నపేట, పుట్రేల, చాట్రాయి ప్రాంతాల నుంచి వాహనాలలో ప్రేక్షకులు వచ్చారు.

బండారం బయటపడేది.. 
చంద్రబాబు కుట్ర రాజకీయాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమా ఆంధ్రాలో విడుదలైతే.. బాబు బండారం బయటపడేది. అందుకనే అడ్డుకున్నట్టున్నారు. ఈ సినిమా చూస్తే... చంద్రబాబు ఎంత నయవంచకుడో ఈ తరం వారికి తెలుస్తుంది.  వక్కలగడ్డ జార్జ్, తిరువూరు మాజీ ఎమ్మెల్యే వక్కలగడ్డ ఆదాం తనయుడు 

వాస్తవాలు తెలుసుకుందామనే... 
ఆంధ్రప్రదేశ్‌లో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రం చూసేందుకు అవకాశం లేదు. ఎన్టీఆర్‌ను ఎంత క్షోభకు గురిచేశారో, ఆనాడు అసలేం జరిగిందో తెలుసుకునేందుకు వచ్చాం. ఎన్టీఆర్‌కు అంతమంది సంతానం ఉన్నప్పటికీ తిండి పెట్టలేదంటే బాధేసింది. లక్ష్మీపార్వతిని అడ్డుపెట్టుకుని చంద్రబాబు చేసిన కుట్ర రాజకీయాలు తెలుసుకున్నాం.  – పి.రాధాకృష్ణ, నూజివీడు

వాటికన్నా బాగుంది... 
బాలకృష్ణ తీసిన ఎన్టీఆర్‌ బయోపిక్‌లు రెండూ చూశాను. అవి అస్సలు బాగాలేదు. చరిత్ర తెలుసుకోవాలంటే ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమా చూడాల్సిందే. ఎన్టీ రామారావుకు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కున్నారో చూస్తే... కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పటం ఖాయం.  – కాలేషావలీ, నూజివీడు

కావాలనే అడ్డుకున్నారు... 
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా విడుదలను కావాలనే అడ్డుకున్నారు. అక్కడ విడుదల చేసేంతవరకు దీనిని చూసేందుకు తెలంగాణ థియేటర్లకు వస్తూనే ఉంటాం. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఓట్లు పడవనే భయంతోనే ఆంధ్రాలో సినిమా విడుదలను అడ్డుకున్నారు. – బొమ్మారెడ్డి స్నేహారెడ్డి, నూజివీడు

ఆనాడేం జరిగిందోనని... 
ఏపీలో ‘లక్ష్మీస్‌ ఎన్‌టీఆర్‌’ చిత్రం విడుదలపై కోర్టు స్టే ఉంది. ఎన్టీఆర్‌ జీవితం చివరి రోజుల్లో ఏం జరిగిందోనని తెలుసుకునేందుకని సినిమా చూసేందుకు వచ్చాను. సినిమా చాలా బావుంది. ఏపీలో కూడా విడుదల చేస్తే... ఎన్టీఆర్‌ అభిమానులు చూసి తరిస్తారు. – పర్సా రాంబాబు, టీ నర్సాపురం, పశ్చిమగోదావరి జిల్లా 

మరిన్ని వార్తలు