నలుగురు ప్రపూర్ణులు!

26 May, 2018 13:15 IST|Sakshi
ఇళయరాజా, రావు బాలసరస్వతి, చంద్రబోస్‌ ,వీవీఎస్‌ లక్ష్మణ్‌

ముగ్గురికి కళా ప్రపూర్ణ.. ఒకరికి క్రీడా ప్రపూర్ణ

కళారంగంలో ఇళయరాజా, రావు బాలసరస్వతి, చంద్రబోస్‌

క్రీడా రంగం నుంచి వీవీఎస్‌ లక్ష్మణ్‌

ప్రతిపాదించిన ఏయూ పాలకమండలి

గవర్నర్‌ ఆమోదానికి  నలుగురి పేర్లు

స్నాతకోత్సవ నిర్వహణపై  సమావేశంలో చర్చ

ఏయూక్యాంపస్‌(విశాఖ తూర్పు): ఈసారి నలుగురికి కళా ప్రపూర్ణ, క్రీడా ప్రపూర్ణలతో గౌరవించాలని ఆంధ్రి విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 31న జరగనున్న వర్సిటీ 85వ స్నాతకోత్సవ నిర్వహణపై శుక్రవారం సాయంత్రం జరిగిన పాలకమండలి సమావేశంలో చర్చించారు. కళాప్రపూర్ణకు ముగ్గురి పేర్లు, క్రీడా ప్రపూర్ణకు ఒకరి పేరును సభ్యులు ప్రతిపాదించారు. వీటిని గవర్నర్‌ ఆమోదానికి పంపనున్నారు. కళాప్రపూర్ణకు మ్యాజిక్‌ మాయిస్ట్రో ఇళయరాజా, ప్రఖ్యాత గాయని రావు బాలసరస్వతి, సినీ గేయ రచయిత చంద్రబోస్‌.. క్రీడా ప్రపూర్ణకు క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ల పేర్లను ఖరారుచేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు సాహిత్యంలోనూ ఈసారి కళాప్రపూర్ణ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహణపైఅభ్యంతరాలు
కొత్తగా నిర్మంచిన కన్వెన్షన్‌ సెంటర్‌లో స్నాతకోత్సవం నిర్వహించాలనే నిర్ణయాన్ని పలువురు సభ్యులు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన పాత భవనంలో నిర్వహిస్తే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పాత భవనానికి మరమ్మతులు అవసరమని, వర్షం వస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు వర్సిటీ అధికారులు పాలక మండలి సభ్యులకు సర్దిచెప్పారని తెలిసింది. స్నాతకోత్సవ మందిరం మరమ్మతులు నెల రోజుల్లో పూర్తిచేయించాలని సభ్యులు సూచించారు. ఇటీవల నిర్వహించిన పరిశోధన ప్రవేశాలు, త్వరలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పరిశోధన ప్రవేశాల సెట్‌(ఏపిఆర్‌సెట్‌)పై చర్చ జరిగింది.. గతంలో తాత్కాలికంగా నిలిపివేసిన ఎగ్జిక్యూటివ్‌ పీహెచ్‌డీలలో అర్హత కలిగిన వారిని కొనసాగించాలని, అర్హత లేకుండా ప్రవేశం పొందిన వారిని తొలగించాలని ప్రభుత్వం ఇచ్చిన జివోను వర్సిటీ ఆమోదించినట్లు సమాచారం. వీటితో పాటు వర్సిటీలో జరిగిన ధర్మపోరాట దీక్షకు ఏయూ మైదానం కేటాయించడం తదనంతర అంశాలపై సైతం పాలక మండలి సభ్యులు చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

స్పష్టత లేని గవర్నర్‌ పర్యటన
స్నాతకోత్సవానికి గవర్నర్‌ రాక ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 29 నాటికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. గవర్నర్‌ వచ్చి.. అన్నీ సజావుగా సాగితే సుదీర్ఘ కాలం తర్వాత పూర్తిస్థాయి స్నాతకోత్సవం జరుగుతుంది. ఈ స్నాతకోత్సవంలో 318 మందికి పీహెచ్‌డీలు, అవార్డులు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమావేశంలో వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు, రెక్టార్‌ ఆచార్య కె.గాయత్రీదేవి, రిజిస్ట్రార్‌ ఆచార్య వి.ఉమామహేశ్వర రావు, సభ్యులు ఆచార్య ఎం.ప్రసాద రావు, జి.శశి భూషణ రావు, సురేష్‌ చిట్టినేని, డాక్టర్‌ ఎస్‌.విజయ రవీంద్ర, డాక్టర్‌ పి.సోమనాధ రావు, ఆచార్య ఎన్‌.బాబయ్య, ఆచార్య కె.రామమోహన రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు