సంగీతంలో రాణిస్తా

11 Sep, 2014 00:36 IST|Sakshi
సంగీతంలో రాణిస్తా

ఒక్కొక్కరు ఒక్కో రంగంలో ప్రతిభ చాటుకుంటారు. కొందరు మాత్రం పలురంగాల్లో సత్తా చాటాలని ఆశిస్తుంటారు. ఈ రెండో కోవకు చెందింది ఆండ్రియా. నటిగా ఈ సుందరి ప్రతిభ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ బోల్డ్ గర్ల్‌లో మంచి గాయని కూడా దాగి ఉన్న విషయం తెలిసిందే. ఆయిరత్తిల్ ఒరువన్ లాంటి పలు చిత్రాల్లో ఈ బ్యూటీ పాడిన గీతాలు బహుళ ప్రాచుర్యం పొందాయి. ఇలా నటిగా, గాయనిగా బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటున్న ఆండ్రియా ఇప్పుడు తనలోని మూడో ముఖాన్ని చూపించాలని తపిస్తున్నారు.
 
 సంగీత దర్శకురాలిగా రాణిస్తానని చెబుతున్నారు. తన కోరిక కూడా అదేనని స్పష్టం చేశారు. ఈ కారణంగానే ఆండ్రియా యువ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో సన్నిహిత సంబంధాలు పెట్టుకున్నారని, అయితే అది మరో రకంగా విమర్శలకు తావిచ్చిందనే టాక్ కూడా ఉంది. ఏదేమయినా ఆ ప్రయత్నం బెడిసికొట్టినా ఆండ్రియా సంగీత దర్శకురాలవ్వాలనే లక్ష్యంగా సాగిపోతున్నారు. ఆ మధ్య తను నటించిన తరమణి చిత్రం కోసం ఒక పాటను ఆంగ్లంలో రాసి తానే ట్యూన్ కట్టారు. రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీత దర్శకుడు. ఆండ్రియా ఆసక్తిని గ్రహించి ట్యూన్లు కూడా బాగుండడంతో ఆ చిత్రంలో పొందుపరచడానికి యువన్ శంకర్ రాజా అంగీకరించారట.
 
 ఇప్పుడీ పాటనే దర్శకుడు రామ్ తన చిత్ర ప్రమోషన్ కోసం వాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. షోల్ అప్ తరణి.... అనే ఆ పాటను నటుడు కమల్ హాసన్ విడుదల చేశారు. పనిలో పనిగా ఆండ్రియా ట్యూన్‌‌స బాగున్నాయనే కితాబు కూడా ఇచ్చారు. అలా ఆయన ప్రోత్సహించడంతో ఆండ్రియా ఖాళీ సమయాల్లో తన సెల్‌ఫోన్‌లోనే మరిన్ని ట్యూన్స్ కట్టి రికార్డ్ చేసుకున్నారట. ఈ పాటల ఆల్బమ్‌ను పలువురు సినీ ప్రముఖులకు అందించారట. అలా అందుకున్న వారిలో దర్శకుడు గౌతమ్ మీనన్ కూడా ఉన్నారట. ఆయనకు ఆండ్రియా ట్యూన్ తెగనచ్చేయడంతో ఆమెను సంగీత దర్శకురాలిగా పరిచయం చేసే పనిలో ఉన్నారని సమాచారం.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి