‘అది మగవారి తప్పు మాత్రమే కాదు’

19 Oct, 2018 09:27 IST|Sakshi

మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. ఇటీవల మీటూ అంటూ కొత్తగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏళ్ల క్రితం జరిగిందంటూ కొందరు ఇప్పుడు ఆరోపణలు చేయడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నా, వ్యతిరేకిస్తున్న వారు లేకపోలేదు. నిందలు ఎదుర్కొంటున్న వారిలో కొందరైతే మీటూ అనేది టీకప్పులో తుపాన్‌లా సమసిపోతుందని చాలా ఈజీగా తీసుకుంటున్నారు.

ఇటీవల బాలీవుడ్‌ నటి తనూశ్రీదత్‌ సీనియర్‌ నటుడు నానాపటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. ఆ తరువాత పలువురు అలాంటి ఆరోపణలు చేయడం మొదలెట్టారు. ఇక గాయని చిన్మయి మీటూ సామాజిక మాధ్యమంలో ప్రముఖ గీతరచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో చిన్మయికి పలువురు మద్దతుపలుకుతున్నారు.

నా జీవితం నా ఇష్టం అనేలా ప్రవర్తించే నటి ఆండ్రియా రూటే వేరు కనుక ఆమె ఎలా స్పందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ అమ్మడు ధనుష్‌ హీరోగా నటించిన వడచెన్నై చిత్రంలో ముఖ్యపాత్రను పోషించింది. ఈ చిత్రం బుధవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆండ్రియా ఏమందో చూద్దాం.

అవకాశాల పేరుతో నటీమణులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే విషయంపై స్పందిస్తూ అలాంటి వారు అంగీకరించకుండానే మగవారు పడక గదికి పిలుస్తున్నారా అని ప్రశ్నించింది. అయితే తానూ మీటూ వ్యవహారాన్ని స్వాగతిస్తున్నానంది. ఇది మార్పు కోసం మంచి సమయంగా భావిస్తున్నానంది. అయితే ఈ మీటూ అనేది 5,10 ఏళ్ల క్రితం లేకపోయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

తాను పెద్దపెద్ద దర్శకుల చిత్రాల్లోనూ, ప్రముఖ నటులతోనూ కలిసి పని చేశానంది. హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్నా కథా పాత్రల్లోనూ నటిస్తున్నానని చెప్పింది. ప్రతిభ, శ్రమను నమ్ముకున్నానని ఆండ్రియా పేర్కొంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి పాత్రల్లో నటిస్తున్న పలు నటీమణులు తనకు తెలుసని చెప్పింది. ‘మీటూ’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారిని ఆండ్రియా వ్యాఖ్యలు షాక్‌కు గురిచేస్తున్నాయి.

మరిన్ని వార్తలు