పదేళ్ల తర్వాత మళ్లీ జంటగా...

21 Dec, 2014 23:19 IST|Sakshi
పదేళ్ల తర్వాత మళ్లీ జంటగా...

‘‘నా భర్తను డెరైక్ట్ చేయడం ఓ సరికొత్త అనుభూతినిస్తోంది’’ అంటున్నారు హాలీవుడ్ స్టార్ ఏంజెలినా జోలీ. ప్రస్తుతం ఆమె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘బై ది సీ’. వైవాహిక బంధాన్ని కాపాడుకోవడానికి ఓ భార్య, భర్త ఏం చేశారన్న కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది. ఎన్నో ఏళ్ల క్రితం జోలీ ఈ కథ రాసుకున్నారట. కథానాయికగా బిజీగా ఉన్నందున, దర్శకత్వ శాఖలోకి అప్పుడే అడుగుపెట్టడం ఇష్టం లేక ఆమె ఈ కథను తెరకెక్కించలేదు.

గత ఏడాది ఆమె బ్రాడ్ పిట్‌ను పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచీ ఈ కథను వెండితెరపై ఆవిష్కరించాలనే పట్టుదలతో ఉన్నారు జోలీ. ఇందులో  తన నిజజీవిత భర్త బ్రాడ్‌పిట్, తానూ భార్యాభర్తలుగా నటిస్తే బాగుంటుందని భావించి, ఈ ఏడాది ఈ చిత్రాన్ని ఆరంభించారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. 2005లో జోలీ, పిట్‌లు ‘మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్’లో నటించారు. పదేళ్ల తర్వాత తామిద్దరం మళ్లీ జంటగా నటిస్తున్నందుకు జోలీ పరమానందపడిపోతున్నారు.