సన్నబడాలి.. ఒళ్లు చేయాలి!!

10 Mar, 2014 08:55 IST|Sakshi
సన్నబడాలి.. ఒళ్లు చేయాలి!!

చక్కనమ్మ చిక్కినా అందమే అంటారు. హీరోయిన్లయితే సన్నగా ఉంటేనే చూస్తామంటారు చాలామంది. అయితే.. అందరి విషయంలోనూ ఇది వర్తించదండోయ్. ఎందుకంటే, కొంతమంది బొద్దుగుమ్మలను సన్నబడాలని దర్శకులు, నిర్మాతలు చెబుతుంటే మరికొందరిని మాత్రం మరీ చిన్నపిల్లలా కనపడుతున్నావు.. కొంచెం ఒళ్లు చేస్తేనే మంచిదంటున్నారు. ఈ రెండు విషయాలకు రెండు మంచి ఉదాహరణలున్నాయి.

కెరీర్ ప్రారంభంలో తాను నటించిన షాపింగ్ మాల్, జర్నీ లాంటి సినిమాల్లో సన్నగా, స్లిమ్గా కనిపించిన పదహారణాల తెలుగమ్మాయి అంజలి.. ఆ తర్వాత సీతమ్మగా తెలుగువారి హృదయాలను కొల్లగొట్టింది. తర్వాతి కాలంలో మాత్రం అంజలి కొంచెం లావెక్కింది. అందుకే యంగ్ హీరోలు ఈ అమ్మడి జోలికి పోవటంలేదు. దాంతో సీనియర్ హీరోల సరసన చేయడమైతే చేస్తోంది. కానీ తనకు చాన్సులు ఎందుకు రావట్లేదో లేటుగా తెలుసుకుంది. అందుకే జిమ్లో తెగ కుస్తీలు పడుతోందట. ఎలాగైనా సరే బరువు తగ్గించుకుని యంగ్ హీరోలతో ఆడిపాడాలని ఆశపడుతుంది. ఈమె ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో.. ఏ హీరోలు ఛాన్సులిస్తారో వేచి చూడాలి.

మరోవైపు బుల్లితెర నుంచి వెండితెరమీదకు ప్రమోషన్ తెచ్చుకుని ఆడవారి మాటలకు అర్థాలే వేరులే దగ్గర్నుంచి ఇటీవలే విడుదలైన బంగారుకోడిపెట్ట వరకు ఓ అరడజను సినిమాల్లో నటించేసిన కలర్స్ స్వాతికి మాత్రం దర్శక నిర్మాతలు కొంచెం లావెక్కితే మంచిదని చెబుతున్నారు. మరీ చిన్నపిల్లలా కనిపిస్తున్నావని, అందువల్ల కొంచెం లావెక్కితే మంచిదని ఆమెకు చెప్పడంతో ఎంచక్కా తనకిష్టమైన ఫుడ్ లాగించేస్తూ లావయ్యే ప్రయత్నాలు చేస్తోందట స్వాతి.