నచ్చినవి రాలేదు.. వచ్చినవి నచ్చలేదు

10 Mar, 2020 05:33 IST|Sakshi

‘‘టీవీ కెమెరా, సినిమా కెమెరా, వెబ్‌సిరీస్‌ కెమెరా... నటించేవారికి ఏదైనా ఒకటే. యాక్టింగ్‌ యాక్టింగే’’ అన్నారు బాలాదిత్య. అన్నపూర్ణ, మాస్టర్‌ రవితేజ ప్రధాన పాత్రధారులుగా నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన కీలక పాత్రధారులు. ఎంఎన్‌ఆర్‌ చౌదరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదలవుతోంది. బాలాదిత్య మాట్లాడుతూ – ‘‘పదిహేడేళ్ల వయసులో హీరోగా ‘చంటిగాడు’ సినిమాలో నటించాను. కానీ సరైన విద్యార్హత ఉండాలనే మా అమ్మ మాట కోసం నా యాక్టింగ్‌ కెరీర్‌కు దాదాపు ఐదేళ్లు బ్రేక్‌ ఇచ్చాను. కంపెనీ సెక్రటరీ కోర్సులో అర్హత సాధించి, ముంబైలో ట్రైనింగ్‌ తీసుకున్నాను.

2013–2014 సమయంలో సినిమా చాన్సుల కోసం ట్రై చేశాను. నా దగ్గరకు వచ్చిన కొన్ని కథలు నాకు నచ్చలేదు. ఓ ప్రముఖ టీవీ చానెల్‌కి చెందిన ఓ ప్రోగ్రామ్‌ ద్వారా మళ్లీ కెమెరా ముందుకు వచ్చాను. ఇటీవల ‘ఎంత మంచివాడవురా!’ సినిమాలో ఓ రోల్‌ చేశాను. ఇప్పుడు ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’లో మంచి పాత్ర చేశాను. అన్నపూర్ణమ్మగారి మనవడు అనే పాత్రను తీసుకుని ఆ కథలో, ప్రణయ్‌–అమృతల కథను సినిమాటిక్‌గా కలిపారు. నేను ప్రణయ్‌ పాత్ర చేశాను. సినిమా, టీవీ అనే తేడా ఇప్పుడు లేదు. చిరంజీవి, నాగార్జున, సాయికుమార్‌గార్లు వంటివారు టీవీ ప్రొగ్రామ్స్‌ చేస్తున్నారు. ‘రాసాత్తి’ అనే ఓ తమిళ సీరియల్‌లో నటిస్తున్నా. ‘గాడ్స్‌ ఆఫ్‌ ధర్మపురి’ అనే ఓ వెబ్‌సిరీస్‌ చేశా’’ అన్నారు.  

మరిన్ని వార్తలు