సాహిత్యానికి సినీ వారధి

14 Jul, 2015 00:38 IST|Sakshi
సాహిత్యానికి సినీ వారధి

 తనికెళ్ళ తాజా ప్రయత్నం
ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి మరో కొత్త ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ‘సిరా’ లాంటి షార్ట్ ఫిల్మ్‌లతో, ‘మిథునం’ లాంటి సినిమాతో అవార్డులూ, రివార్డులూ అందుకున్న ఆయన మళ్ళీ మెగాఫోన్ పడుతున్నారు. విశేషం ఏమిటంటే, సాహిత్యాభిమాని, స్వయంగా రచయిత అయిన తనికెళ్ళ భరణి ఈ సినిమాకు కథను తెలుగు సాహిత్యంలో నుంచే ఎన్నుకోవడం! ఇటీవలే మరణించిన ఒక ప్రముఖ తెలుగు రచయిత రాసిన పాపులర్ కథతో ఈ కొత్త సినిమా తయారు కానుంది.

ఒక పాపులర్ యంగ్ హీరో ఈ చిత్రంలో కథానాయక పాత్ర పోషిస్తున్నారు.
నిజానికి, తనికెళ్ళ దర్శకత్వంలో మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప పురాణ గాథ ఆధారంగా ‘కన్నప్ప కథ’ చిత్రాన్ని భారీగా రూపొందించడానికి ఇటీవల ప్రయత్నాలు జరిగాయి. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించే ఆ పౌరాణిక చిత్రానికి అన్ని సన్నాహాలూ పూర్తయ్యే లోపల ఈ సరికొత్త సినిమా పట్టాలెక్కనుంది. ఈ సెప్టెంబర్‌లోనే కొత్త సినిమాను ప్రారంభించి, సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే, తనికెళ్ళ దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన ‘మిథునం’ సినిమా కూడా తెలుగు సాహిత్యంలోని సుప్రసిద్ధమైన కథ (రచయిత శ్రీరమణ ‘మిథునం’) ఆధారంగా రూపొందినదే. ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా సాహిత్యం నుంచి సెల్యులాయిడ్ మీదకు ఎక్కుతున్నదే కావడం గమనార్హం! మొత్తానికి, ఈ సరికొత్త ప్రయత్నంతో తనికెళ్ళ దర్శకుడిగా మరోమారు తన సత్తా చాటడమే కాక, మన సాహిత్యానికీ, సినిమాకూ మధ్య పాత తరంలో ఉన్న అనుబంధాన్ని మళ్ళీ పటిష్ఠం చేస్తారని భావించవచ్చు. తనికెళ్ళ, ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటివారిని ఆదర్శంగా తీసుకొని, మరింతమంది డెరైక్టర్లు సాహిత్యం నుంచి సినిమా కథలు తీసుకుంటే, కొత్త రకం చిత్రాలు వస్తాయి కదూ!