అమ్మ కోసం మళ్లీ వస్తా: రేఖ...

17 Nov, 2019 20:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘తాను ఇవాళ వేదికపై ఉన్నానంటే అందుకు కారణం అక్కినేని నాగేశ్వరరావు గారు, అంజలీదేవిగారే. వారిద్దరూ నటించిన ‘సువర్ణసుందరి’ చిత్రం నా జీవితంలో చూసిన తొలి సినిమా.  వందసార్లు అయినా ఆ సినిమా చూశాను. సినిమా అంటే ఏంటి అనే తెలియని వయసులో ఆ సినిమా చూశాక నాకు పిచ్చి పట్టేసింది’ అని ప్రముఖ బాలీవుడ్‌ నటి రేఖ తెలిపారు. అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్న ఆమె ఈ సందర్భంగా  మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోకు వస్తే నా సొంతింటికి వచ్చినట్టుంది. 

అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడ నుంచి స్టార్ట్‌ చేయాలి. ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళితే.. మా చిన్నాన్న వేదాంతం రాఘవయ్య గారు. నా చిన్నప్పుడు ఆయన ఎప్పుడూ మాట్లాడుతుండేవారు. ఆ అబ్బాయ్‌ చాలా ఫోకస్డ్‌... చాలా స్మార్ట్‌, చాలా ఫన్నీ, ప్రేమ, క్వయిట్‌ కానీ ...కెమెరా ఆన్‌ అయితే అదరగొట్టేస్తారు. ఎవరూ...ఎవరూ అని అడిగితే ఇంకెవరూ నాగేశ్వరరావుగారు అని చెప్పారు. నేను చూసిన మొదటి సినిమా ‘సువర్ణ సుందరి’. ఇక్కడ నేను నిల్చున్నానంటే దానికి కారణం నాగేశ్వరరావుగారు, అంజలీదేవినే. ఆ సినిమా చూశాక పిచ్చి పట్టేసింది. ఎలాగేనా సినిమాల్లో నటించాలని అనుకున్నాను.

చదవండి: రేఖగారు మీరు ఇంత అందంగా ఎలా ఉన్నారు.. 

నటి అయ్యాక షూటింగ్‌కు వెళుతూ... రోజూ బంజారాహిల్స్‌ నుంచి వెళుతూ గుడిలోకి వెళ్లేదాన్ని. అక్కడ నుంచి అలా తిరిగితే నాగేశ్వరరావు గారి ఇల్లు. ఇంకోవైపు సుబ్బరామిరెడ్డిగారి ఇల్లు. రోడ్డు మీద వెళుతూనే నాగేశ్వరరావుగారికి మనసులోనే నమస్కరించేదాన్ని. పెద్ద స్టార్‌ను అయ్యేలా దీవించమని. ఒకరోజు భోజనానికి వాళ్ల ఇంటికి పిలిచారు. అమ్మ బాబోయ్‌ అని భయపడ్డాను. అమ్మాయ్‌ ఏం అనుకున్నావ్‌. నిన్ను చాలా గమనించేవాడిని తెలుసా? అని అన్నారు. నేను ఒక‍్కమాట మాట్లాడితే ఒట్టు. చూడమ్మాయ్‌.... నువ్వు ఏం తింటున్నావో అనేది కూడా ముఖ్యం. కానీ అన్నింటికి కంటే ముఖ్యం నువ్వు ఏం తింటావో అది మన మీద ప్రభావం చూపుతుందని. అది అప్పట్లో నాకు అర్థం కాలేదు కానీ తర్వాత తెలిసింది. నాగేశ్వరరావుగారితో పాటు అలాగే మా నాన్నగారు చదువు, నటన గురించి చెప్పిన రెండు మాటలు జీవితాంతం చీర పల్లులో మూటకట్టుకుని పెట్టుకున్నాను.

అందరూ అడుగుతున్నారు ఇప్పటికీ ఇంత అందంగా ఎలా ఉన్నారు అని. అవి నాకు  అమ్మా,నాన్నల నుంచి వారసత్వంగా వచ్చిన జీన్స్‌ అంతే. ఇందుకోసం నేను ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. సినిమా కెరీర్‌లో ఎత్తు పల్లాలు ఉంటాయి. నా జీవితంలో కూడా అలాంటివి జరిగాయి. అయినా తట్టుకుని నిలబడ్డాను. అప్పట్లో హాస్పటల్‌లో ఉన్న అమ్మ తన కోసం ఓ తెలుగు సినిమా చేయమంది. అమ్మ కోసం తెలుగు సినిమాలో నటిస్తా. తెలుగు బాగా నేర్చుకుని శ్రీదేవి అంత స్పష్టంగా మాట్లాడతాను’ అని తెలిపారు.

మరిన్ని వార్తలు