శ్రీదేవి, రేఖలకు ఏఎన్‌ఆర్‌ అవార్డులు

14 Nov, 2019 13:33 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చిత్ర పరిశ్రమలో అద్భుతమైన ప్రతిభ చూపిన వారికి అందించే ప్రతిష్టాత్మక అక్కినేని నాగేశ్వరావు జాతీయ పురస్కారాలను గురువారం కమిటీ ప్రకటించింది. 2018-19కి గానూ దివంగత నటి శ్రీదేవి బోనీకపూర్‌తో పాటు, మరో సీనియర్‌ హీరోయిన్‌ రేఖ.. ఏఎన్‌ఆర్‌ అవార్డులను అందుకోనున్నారు. కాగా 2013లో ఏఎన్‌ఆర్‌ అవార్డును అందుకున్న అలనాటి అందాల నటి శ్రీదేవి మరోసారి ఈ అవార్డుకు ఎంపిక కావడం విశేషం.

నవంబరు 17న అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించే ఒక కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి ఈ అవార్డులను అందించనున్నారని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీదేవి తరపున ఆమె భర్త బోనీకపూర్‌ ఈ పురస్కారాన్నిస్వీకరించనున్నారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ కాలేజీ ఆఫ్‌ ఫిలిం అండ్‌ మీడియా (ఏసీఎఫ్‌ఎం) తృతీయ కాన్వకేషన్ (స్నాతకోత్సవం)ను కూడా నిర్వహించనున్నట్టు తెలిపింది.  

కాగా ఏఎన్‌ఆర్‌ తొలి జాతీయ అవార్డును బాలీవుడ్‌ హీరో దేవానంద్‌, 2017లో టాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అందుకున్నారు. అలనాటి మేటి నటి అంజలీదేవి (2007), నర్తకి, నటి వైజయంతిమాల (2008), నేపథ్య గాయని లతా మంగేష్కర్ (2009), దర్శకుడు కె. బాలచందర్ (2010), దర్శకురాలు హేమమాలిని (2011), రచయిత దర్శకుడు శ్యామ్ బెనగల్ (2012), బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌బచ్చన్‌ (2014),  సూపర్‌స్టార్‌ కృష్ణ(2015) ఈ పురస్కారాన్ని అందుకున్న ప్రముఖులు.

మరిన్ని వార్తలు