ఈ ‘అంతర్ముఖం’ గొప్ప ప్రయత్నం - దాసరి

4 Mar, 2014 23:37 IST|Sakshi
ఈ ‘అంతర్ముఖం’ గొప్ప ప్రయత్నం - దాసరి

సినీ పాత్రికేయులందరూ కలిసి రాసిన కథల సంకలనం ‘అంతర్ముఖం’ను ఇటీవల హైదరాబాద్‌లో దాసరి నారాయణరావు ఆవిష్కరించారు. ఈ పుస్తకంలోని 41 కథలను 41 మంది సినీ పాత్రికేయులు రాశారు. అందుకే... ఈ పుస్తకాన్ని 41 వేల రూపాయలకు దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు సి.కల్యాణ్ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ -‘‘ఇది గొప్ప ప్రయత్నం. ఇవి గొలుసు కథలు కావు. ఎవరి కథ వారిది. ఇందులో అనుభవాలు కూడా ఉన్నాయి. నాకు తెలిసి ఈ పుస్తకాన్ని మన దర్శక, నిర్మాతలు చదవరు. ఇది రేపు చెన్నయ్ వెళుతుంది. ఇందులో ఏదో ఒక కథ మూడు నెలల్లో సినిమాగా వస్తుంది. దాని రీమేక్ రైట్స్ మనవాళ్లే కొంటారు. నాటి నుంచి నేటి వరకూ జరుగుతోంది అదే. మనవాళ్లంటే మనకే చులకన. ఇది మన దౌర్భాగ్యం. నిర్మాతల చరిత్ర, దర్శకుల చరిత్ర... ఇలా చాలా పుస్తకాలు సినీ పరిశ్రమపై వచ్చాయి. కానీ... 80 ఏళ్ల తెలుగు చలనచిత్ర చరిత్ర మాత్రం పుస్తకంగా రాలేదు.
 
  80 ఏళ్ల తెలుగు సినిమాల్లో 24 శాఖల విజయాలతో పాటు, పాత్రికేయుల ప్రస్థానాన్ని కూడా పొందుపరిచి ఓ గ్రంథాన్ని తయారు చేస్తే బావుంటుంది. ఈ బాధ్యతను స్వీకరించడానికి పాత్రికేయులు ముందుకొస్తే... సహకరించడానికి నేను సిద్ధం’’ అన్నారు. తెలుగు చలనచిత్ర చరిత్రకు పుస్తకరూపాన్నిచ్చే బృహత్తర కార్యక్రమానికి పది లక్షల రూపాయిలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ప్రకటించారు. పరుచూరి గోపాలకృష్ణ, తమ్మారెడ్డి భరద్వాజ్, ఎస్వీ కృష్ణారెడ్డి, కె.అచ్చిరెడ్డి, తనికెళ్ల భరణి, సునీల్‌కుమార్‌రెడ్డి, బి.జయ, నీలకంఠ, ప్రచురణకర్త వత్సల, సంకలనకర్త బత్తుల ప్రసాద్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా 41మంది సినీ పాత్రికేయులకు దాసరి చేతుల మీదుగా సత్కారం జరిగింది.