సినిమా రివ్యూ: అనుక్షణం

13 Sep, 2014 13:14 IST|Sakshi
సినిమా రివ్యూ: అనుక్షణం
భారీ విజయాలు చేజిక్కకపోయినా...తక్కువ బడ్జెట్‌తో ఎక్కువ లాభాలను సొంతం చేసుకుంటున్న రాంగోపాల్ వర్మ తాజాగా మంచు విష్ణుతో కలిసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై ‘అనుక్షణం’ చిత్రాన్ని రూపొందించారు. సెప్టెంబర్ 13 తేది శనివారం విడుదలైన 'అనుక్షణం' విజయం, లాభాల్ని దక్కించుకునేలా ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. 
 
సీతారాం(సూర్య) ఓ సైకో, సీరియల్ కిల్లర్. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో మహిళ లను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. పోలీసు విభాగానికి సవాల్‌గా మారుతాడు. వరుస హత్యల హంతకుడ్ని పట్టుకోవడం పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌కు అగ్నిపరీక్షగా మారుతుంది. సీరియల్ కిల్లర్‌ను గౌతమ్, పోలీసు విభాగం పట్టుకోవడానికి అనుసరించిన వ్యూహాలు ఏంటి?  వరుస హత్యలకు ఎలా అడ్డుకట్టవేశారనేది క్లుప్తంగా చిత్ర కథ. 
 
సీతారాం పాత్రలో  సీరియల్ కిల్లర్‌గా సూర్య నటించడం కంటే .. జీవించాడని చెప్పవచ్చు. సూర్య తన లుక్స్, బిహేవియర్‌తో గుబులు రేపాడు. కొత్త నటుడైనా... నటుడిగా మంచి పరిణతి ప్రదర్శించాడు. ఈ చిత్రంలో కీలక పాత్రను పోషించడం ద్వారా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. 
 
వరుస హత్యల కేసు దర్యాప్తు, సీరియల్ కిల్లర్ హంతకుడి పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గౌతమ్‌గా మంచు విష్ణు నటించాడు. ఓ పోలీస్ ఆఫీసర్ కావాల్సిన  ఎక్స్‌ప్రెషన్స్, లుక్స్, నడక, స్టైల్‌ను పండించడంలో మంచు విష్ణు తన మార్కును చూపించారు. ఓ డిఫెరెంట్ లుక్‌తో విష్ణు ఆకట్టుకున్నాడు. 
 
అమెరికాలో వరుస హత్యలపై అధ్యయనం చేసిన రీసెర్చర్‌గా రేవతి కనిపించారు. పోలీసు విభాగానికి సహాయం అందించే పాత్రలో రేవతి తన పాత్ర మేరకు పర్వాలేదనిపించారు. టీవీ యాంకర్‌గా మధు శాలిని, గౌతమ్ భార్య తేజస్వినీలు, నవదీప్, సుజిత్‌లు ఓకే అనిపించారు. 
 
సాంకేతిక విభాగాల పనితీరు
ఈ చిత్రంలో ఫోటోగ్రఫి, రీరికార్డింగ్‌లది కీలక పాత్ర. ప్రేక్షకులను ఆక ట్టుకోవడంలో ఈ రెండు విభాగాలు ప్రధాన పాత్ర పోషించాయి. టెంపో, మూడ్, ఆంబియెన్స్ రిఫ్లెక్ట్ చేయడానికి లైటింగ్‌ను చక్కగా వాడుకున్నారు. సాంకేతిక అంశాలను బాలెన్స్ చేస్తూ వర్మ చిత్రీకరించిన తీరు బాగుంది. ఇలాంటి  అంశాలతో తెరకెక్కించి విధానంలో వర్మది అందె వేసిన చెయ్యి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
 
దర్శకుడి పనితీరు: 
ఆనందం కోసమే వరుస హత్యలకు పాల్పడే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాప్ సీరియల్ కిల్లర్ జీవితాలతో స్పూర్తి పొంది ‘అనుక్షణం చిత్రం రూపొందించారనేది స్పష్టంగా అర్ధమవుతుంది. సీరియల్ కిల్లర్ బిహేవియర్‌ను చక్కగా చిత్రీకరించారు. హత్యల నేపథ్యంలో మీడియా తీరును తన స్టైల్ తెరపైనా చూపించారు. ఎప్పటిలాగే  టెక్నికల్ అంశాలను తన కావాల్సిన స్టైల్‌లో వినియోగించుకున్నారు. క్లైమాక్స్‌ను హడావిడిగా ముగించేడం.. కథ, కథనంలో అక్కడక్కడా కొన్ని లోపాలున్నా.. టెక్నికల్ అంశాలతో కవర్ చేశాడంలో వర్మ సఫలమయారు.  అయితే గత కొద్ది కాలంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్న వర్మ  చిత్రాల కంటే ’అనుక్షణం’ బాగుంటడం ఆయన అభిమానులకు ఊరట. ఇంట్లో టెలివిజన్‌లో క్రైమ్ ఎపిసోడ్‌లతో ఆనందించే వీక్షకులకు క్రైమ్, హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం థ్రిల్‌కు గురిచేయడం ఖాయం. 
 
-- అనుముల రాజబాబు