ప్రేమలో పడిపోయా

7 Aug, 2018 00:07 IST|Sakshi

‘‘తొలిప్రేమ’ తర్వాత ఓ మంచి సినిమా చేయాలనుకుంటున్న టైమ్‌లో ‘శ్రీనివాస కళ్యాణం’ కథ విని ఓకే చేశా. కథ చెప్పిన దాని కంటే విజువల్‌గా గ్రాండ్‌గా ఉంది. ఉత్తరాది నుంచి వచ్చిన నాకు తెలుగు సంప్రదాయాల గురించి పెద్దగా తెలియదు. సెకండాఫ్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. అంత అందంగా తీశారు. ప్రస్తుత జనరేషన్‌కి ఇలాంటి సినిమా కావాలి’’ అని హీరోయిన్‌ రాశీఖన్నా అన్నారు. నితిన్, రాశీఖన్నా జంటగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీనివాస కళ్యాణం’. ‘దిల్‌’ రాజు, శిరీశ్, లక్ష్మణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రాశీ ఖన్నా చెప్పిన విశేషాలు... 

►అందమైన కుటుంబ కథా చిత్రమిది. మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుకు తెస్తుంది. సినిమా చూసి ఎమోషనల్‌ అయ్యాను. నాకు డబ్బింగ్‌ చెప్పిన ప్రియాంక ఫోన్‌ చేసి ఏడుస్తూ.. చాలా మంచి సినిమా చేశావని అభినందించింది. క్లయిమాక్స్‌లో ప్రకాశ్‌రాజ్‌గారు, నితిన్‌ల నటన అద్భుతం. 

►ఈ సినిమాలో ఎక్కువ మంది నటీనటులున్నారు. అందరిలో ఓ మూడ్‌ క్రియేట్‌ చేసి దాన్ని క్యారీ చేయడం కోసం ఎవరూ ఫోన్స్‌ వాడొద్దని రాజుగారు చెప్పారు. జయసుధ, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, సితార, నరేశ్‌గారి వంటి సీనియర్ల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సినిమా యూనిట్‌తో ప్రేమలో పడిపోయా. షూటింగ్‌ ముగిశాక వారిని వదిలి పెట్టడానికి మనసే రాలేదు. 

►ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేనూ అందరిలానే. అయితే.. ఈ మధ్య విడాకులు ఎక్కువ కావడం వల్ల పెళ్లి పట్ల నమ్మకం తగ్గిపోతుంది. అయితే పెళ్లి అనేది గొప్పది. సినిమా రషెస్‌ చూశాక డైరెక్టర్‌ సతీశ్‌గారి పాదాలను తాకాను. మా సినిమా అందరి హృదయాలను తాకుతుంది. ఈ చిత్రంలో నా పేరు సిరి. సంప్రదాయాలకు విలువ ఇచ్చే పాత్రలో కనిపిస్తా.  

►ఉత్తరాది, దక్షిణాది పెళ్లి సంప్రదాయాలకు చాలా తేడా ఉంది. అయితే అందులో ఫీల్‌ ఒకటే. ఈ సినిమా టైమ్‌లో నేను తెలుగు అమ్మాయిలా ఫీలై నటించా. మా సినిమా చూసిన తర్వాత డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ వద్దు.. స్వంత గ్రామాలకు వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఎమోషనల్‌ సీన్స్‌కు అమ్మాయిలు కనెక్ట్‌ అయి ఏడుస్తుంటారు. మా సినిమా చూస్తూ అబ్బాయిలు ఏడవడం చూశాను.  

►తొలిప్రేమ’కు చాన్స్‌ రావడానికి కారణం ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రం. ‘తొలిప్రేమ’ సినిమా చూసిన రాజుగారు ‘శ్రీనివాస కళ్యాణం’ లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా సైన్‌ చేశాను. తమిళంలో నేను చేసిన మూడు సినిమాలు రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. కంటిన్యూస్‌గా నటనకు అవకాశం ఉన్న పాత్రలు చేస్తున్నాను. ముందు ముందు కూడా క్యారెక్టర్స్‌ సెలక్షన్‌ విషయంలో ఇంతే జాగ్రత్తగా ఉంటా. ప్రేక్షకుల మనసుల్లో నా పాత్రలు నిలిచిపోవాలన్నదే నా లక్ష్యం.

మరిన్ని వార్తలు