నయనతార విలన్‌కి వెల్కమ్!

9 Oct, 2016 23:52 IST|Sakshi
నయనతార విలన్‌కి వెల్కమ్!

‘నాన్ దాన్ రుద్ర’ (నేనేరా రుద్ర).. అంటూ హిందీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తమిళ డైలాగులు చెబుతున్నారు. తమిళ భాషపై పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నారు. హిందీ వదిలేసి తమిళ సినిమా ఏదైనా తీస్తున్నారా? అనుకుంటున్నారా? దర్శకుడిగా కాదు, విలన్‌గా తమిళంలో ఎంట్రీ ఇస్తున్నారాయన. నయనతార పోలీసాఫీసర్‌గా నటిస్తున్న తమిళ సినిమా ‘ఇమైక్క నొడిగల్’. ఇందులో రౌడీ రుద్ర పాత్రలో అనురాగ్ నటించనున్నారు. విలన్‌గా అనురాగ్ కశ్యప్‌కి రెండో చిత్రమిది.
 
 ఆల్రెడీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘అకీరా’లో విలన్ ఈయనే. ఆ సినిమాలో అనురాగ్ విలనిజంకి ఫిదా అయిన మురుగదాస్ తాజా తమిళ సినిమాకి ఆయన పేరును సూచించారట.  ‘‘అనురాగ్ జీ.. వెల్కమ్ టు తమిళ ఇండస్ట్రీ’’ అని చిత్రదర్శకుడు అజయ్ జ్ఞానముత్తు పేర్కొన్నారు. ఇందులో నయనతార, అనురాగ్ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయని సమాచారం. ఈ సినిమాలో అథర్వ, రాశీ ఖన్నాలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.