తిరిగి ఇచ్చేయాలి... లేకపోతే వాళ్లు రోడ్డున పడతారు!

6 Jan, 2016 23:43 IST|Sakshi
తిరిగి ఇచ్చేయాలి... లేకపోతే వాళ్లు రోడ్డున పడతారు!

‘మనకింత చేసిన ఊరికి ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం’ అని ‘శ్రీమంతుడు’ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ చాలామంది పై ప్రభావం చూపించింది. కొంచెం అటూ ఇటూగా హిందీ హీరో, హీరోయిన్ రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొనె కూడా ఈ డైలాగ్‌లో ఉన్నట్లుగా చేశారట. ఈ మాజీ ప్రేమికులు ఇటీవల నటించిన ‘తమాషా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై, పరాజయాన్ని చవిచూసింది.

 ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్‌ని చూపించి, చిత్రనిర్మాతలు ‘తమాషా’ని బాగానే అమ్మారట. కానీ, సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో పంపిణీదారులు భారీ ఎత్తున నష్టపోయారు. కొంతమంది రొడ్డుకొచ్చే పరిస్థితిలో ఉన్నారని టాక్.  తాము తీసుకున్న పారితోషికంలో కొంతలో కొంత అయినా తిరిగిస్తే, పంపిణీదారులకు కొంత ఊరట లభిస్తుందని భావించిన రణ్‌బీర్ 10 కోట్ల రూపాయలు, దీపిక 5 కోట్లు వెనక్కి ఇచ్చేశారట.

 అంటే.. దీపిక సగం పారితోషికం వెనక్కి ఇచ్చినట్లే. వీరిద్దర్నీ చూసి, దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా స్పూర్తి చెందారట. ఆయన దర్శకత్వం వహించిన ‘బాంబే వెల్వట్’ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో ఈ చిత్రాన్ని పంపిణీ చేసిన ఫాక్స్ స్టార్ స్టూడియోస్‌కు తన పారితోషికంలో కొంత తిరిగి ఇచ్చేయాలని అనురాగ్ డిసైడ్ అయ్యారట. భేష్.. బాగుంది కదూ!