ఫోన్ చేస్తే చాలు... అమ్మానాన్నా వచ్చేస్తారు!

24 Nov, 2015 23:33 IST|Sakshi
ఫోన్ చేస్తే చాలు... అమ్మానాన్నా వచ్చేస్తారు!

ఈ ఏడాది అనుష్క నుంచి మూడో సినిమా రానుంది. ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ తర్వాత అనుష్క ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ‘సైజ్‌జీరో’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా, కెరీర్ గురించి విలేకరులతో అనుష్క పంచుకున్న కబుర్లు...
 
* ‘సైజ్ జీరో’ కథ మీకెలా కనెక్ట్ అయింది?
సన్నగా ఉన్న అమ్మాయిలను బరువు పెరగమనీ, లావుగా ఉన్న అమ్మాయిలను సన్నబడమనీ అనడం నా స్కూల్, కాలేజ్ డేస్‌లో చాలాసార్లు విన్నా. అమ్మాయిలు ఎలా ఉన్నా తప్పేనా? అనిపించేది. బాహ్య సౌందర్యం కన్నా అంతః సౌందర్యం మిన్న అనే విషయాన్ని నేను బలంగా నమ్ముతా. అందుకే, లావుగా ఉన్న అమ్మాయిగా నటించా. నేను యోగా నేర్పించేటప్పుడు కొంతమంది మంచి శరీరాకృతి లేదనో, లావుగా ఉన్నామనో.. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో ఆత్మనూన్యతాభావంతో బాధపడే వాళ్ళు. ఫిజికల్ అపియరెన్స్ ముఖ్యం కాదని సినిమా ద్వారా చెప్పే అవకాశం వచ్చింది కాబట్టి చేశా.
 
* పర్సనల్‌గా మీరు ఏ సైజ్‌ని ఇష్టపడతారు?
జీరో సైజ్‌ని అస్సలు ఇష్టపడను. నా ఎత్తుకి తగ్గ బరువు ఉండాలనుకుంటాను. ఆరోగ్యం గురించి కేర్ తీసుకుంటా.
 
* ఇన్నాళ్లూ డైటింగ్ చేసేవారు. ఈ సినిమాలో పాత్ర కోసం ఇష్టం వచ్చినట్లు తిని ఉంటారేమో?
అంతకు ముందు ఏం తిన్నాలన్నా టెన్షనే. ఒక దశలో ఫుడ్‌ని ఫుడ్‌లా చూడడం మర్చిపోతాం. నాకైతే బిస్కెట్స్, చాక్లెట్స్‌ని చూస్తే ఫ్యాట్స్‌లా, రైస్‌ని చూస్తే కార్బోహైడ్రేట్స్‌లా, ఫిష్‌ని చూస్తే ప్రొటీ న్‌లా కనిపిస్తాయి. అంతదాకా వెళ్లకుండా ఫుడ్‌ని ఫుడ్‌లా ఆస్వాదించాలి. స్వీటీ పాత్ర నాకా ఛాన్స్ ఇచ్చింది. వర్కవుట్స్ మానేశా. హాయిగా తిన్నా. కానీ ఆరోగ్యకరమైనవే లాగించా.
 
* ప్రోస్థటిక్ మేకప్‌తో లావుగా కనిపించవచ్చుగా?
కనిపించవచ్చు కానీ, సహజంగా ఉండదు. బాడీ అంతా ప్రోస్థటిక్ చేసుకుని, మొహం మాత్రం అలానే ఉంటే, శరీరం పెద్దదిగా, బాడీ చిన్నదిగా కనిపిస్తుంది. అందుకే దర్శకుడు ప్రకాశ్, రచయిత్రి కనిక కథ చెప్పినప్పుడు బరువు పెరుగుతానన్నా. ఇలాంటి క్యారెక్టర్స్ ఎప్పటికో కానీ రావు.

* ఎంత బరువు పెరిగారు? ఇప్పటికెంత తగ్గారు?
 17 కిలోలు పెరిగాను. ఇప్పుడు తగ్గడం మొదలెట్టా. ’బాహుబలి 2’, ‘సింగమ్’ చేయాలి కదా పది కిలోలు తగ్గా. ఇంకా ఆరేడు తగ్గాలి.
 
* నాగార్జున ‘నేనైతే అలాంటి పాత్రలు చేయ నేమో. ఆరోగ్యంతో ఆడుకున్నట్లే’ అన్నారు. కామెంట్?
అది నిజమే. హఠాత్తుగా లావైనా, ఉన్నట్టుండి సన్నబడినా అనారోగ్యమే. నేను డాక్టర్ల సలహా తీసుకుని పెరిగా. మళ్లీ డాక్టర్ల సలహాతో తగ్గుతున్నా. బరువు పెరిగి, మళ్లీ తగ్గా కాబట్టి అందరూ అలా చేయాలనుకోకూడదు. అది మంచిది కాదు. అంతెందుకు.. భవిష్యత్తులో ఇలా శరీరంతో ప్రయోగాలు చేసే పాత్రలు వస్తే నేను కూడా ఒప్పుకోనేమో.
 
* ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో బాధపడేవాళ్లకి మీరిచ్చే సలహా?
బాహ్య సౌందర్యంతో పని లేదు. మంచి మనసు ప్రధానం. పిల్లలు చాక్లెట్స్ కొనుక్కోవాలని ఆరాటపడేట్లు.. పెద్దవాళ్లు మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్, హెయిర్ ఆయిల్స్‌కి ఎట్రాక్ట్ అయిపోతారు. కానీ, అందం గురించి అదే పనిగా ఆరాటపడిపోకూడదు.
 
* ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ అంటే మీరే అన్నట్లు అయిపోయింది.
హ్యాపీగా ఉంది. ఎందుకంటే, ‘సూపర్’ సినిమా ఒప్పుకున్నప్పుడు నాకేమీ తెలియదు. ఫొటోలు ఎలా దిగాలో కూడా తెలిసేది కాదు. అలాంటిది ఈ స్థాయికి వచ్చానంటే నా హార్డ్ వర్క్ కారణం.
 
* రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఇష్టపడతారా?
వరుసగా పవర్‌ఫుల్ పాత్రలు చేస్తే అంతే. అందుకే, అర్జంటుగా మాస్ మసాలా మూవీ చేయాలని ‘సింగమ్ 3’ ఒప్పుకున్నాను. మాస్ సినిమాలు చేయడానికి బాగుంటాయి. వాటిని వదులుకోను.
 
*  మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో దూసుకెళ్లడంపై మీ ఫీలింగ్? 
మేల్ డామినేషన్ లేదు. నేను రుద్రమదేవికి కత్తి తిప్పినప్పుడు మణికట్టు, మెడ దగ్గర గాయం అయ్యింది. ఒకటీ రెండు సినిమాలకే నాకు చాలా కష్టం అనిపించింది. ఇక, హీరోలు ప్రతి సినిమాకీ ఫైట్స్ చేస్తారు. వాళ్లది మామూలు కష్టం కాదు.
 
* హీరోయిన్లతో పాటు వాళ్ల అమ్మా, నాన్న లొకేషన్‌కి వస్తుంటారు. మీతో ఎవరూ రారు. ఎందుకని?
అమ్మా, నాన్నలకు వాళ్ల పనులు వాళ్లకు ఉంటాయి. నేను హీరోయిన్ అయ్యాను కదా నాతో పాటే ఉంటూ వాళ్ల పనులను మానుకోమని చెప్పలేను. నా మీద మా అమ్మా, నాన్నలకు చాలా నమ్మకం. ‘నీకేం కావాలన్నా ఒక్క ఫోన్ కాల్ చెయ్యి. నీ ముందు వాలిపోతాం’ అంటుంటారు. అలానే చేస్తారు. అంతకన్నా ఇంకేం కావాలి?
 
* ఇండస్ట్రీలో మీకు సపోర్ట్‌గా?
నాగార్జున గారి ఫ్యామిలీ నాతో బాగుంటారు. కీరవాణి, రాజమౌళి కుటుంబసభ్యులు సపోర్టివ్‌గా ఉంటారు. హెల్ప్ కావాల్సొస్తే చాలామంది ఉన్నారు.
 
* నటిగానే కొనసాగుతారా? భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం చేస్తారా?
మనీ మేనేజ్‌మెంట్‌లో నేను చాలా వీక్. పైగా నాది బిజినెస్ మైండ్ కాదు. అందుకని దేనిలోనూ పెట్టుబడి పెట్టదల్చుకోలేదు.
 
* పెళ్లెప్పుడు చేసుకుంటారు?
హీరోయిన్ అవుతాననుకోలేదు. అయ్యా. ఫిమేల్ ఓరియంటెడ్ మూవీస్ చేస్తాననుకోలేదు. చేస్తున్నా. పెళ్లి గురించి కూడా అనుకోవడం లేదు. ఎప్పుడు జరగాలని రాసి పెట్టి ఉంటే అప్పుడు జరుగుతుంది.
 
చిన్నప్పుడు ’ఫెయిరీ టేల్స్’ ఎక్కువ చూసేదాన్ని. ఆ ప్రభావం నా మీద ఎక్కువ. ప్రపంచం, మనుషులంతా అందంగా ఉంటారనీ, జీవితం బాగుంటుందనీ నమ్మేదాన్ని. కథల్లో ఉన్న జీవితం వేరు.. నిజజీవితం వేరని తెలుసుకున్నా. వీలైనంతవరకూ కూల్‌గా ఉంటా. నా కారణంగా ఎవరూ బాధపడకూడదన్నది నా మనస్తత్వం. అందు కని కోపం తెచ్చుకోను. బాగా కోపం వస్తేనే బయటపడతా. ఉన్నది ఒక్క జీవితం కాబట్టి, నెగటివ్‌కి దూరంగా, హ్యాపీగా ఉండాలనుకుంటా.