ఆ దర్శకుడిపై నమ్మకం పోయింది

1 Jul, 2018 09:23 IST|Sakshi

ఆ దర్శకుడిపై నమ్మకం సన్నగిల్లిపోయిందనే అభిప్రాయానికి నటి అనుష్క వచ్చిందా? దీనికి సినీ మీడియా వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఈ స్వీటీలోని అందం, అభినయం ఏది బెటర్‌ అంటే రెండూ పోటీ పడతాయనే చెప్పాలి. ఇటీవల అనుష్క నటించిన రుద్రమదేవి, బాహుబలి, భాగమతి వంటి చిత్రాలు ఆమె నటనా ప్రతిభకు మచ్చుక అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాన్ని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముందీ అన్న ప్రశ్న తలెత్తవచ్చు. అయితే అంత పేరున్న అనుష్క భాగమతి చిత్రం తెరపైకి వచ్చి చాలా కాలం అయినా మరో చిత్రానికి కమిట్‌ కాలేదు.

 దీంతో ఆమె గురించి రకరకాల ప్రచారం జరుగుతోంది. అనుష్క కొత్త చిత్రాలను అంగీకరించడం లేదని, కారణం పెళ్లికి సిద్ధం అవడమేనని, ఇంట్లో పెళ్లి ఒత్తిడి ఎక్కువగానే ఉంది లాంటి అవాస్తవ ప్రచారాలు జోరుగానే సాగుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే అనుష్కకు చాలా అవకాశాలు వస్తున్నాయట. వాటిలో కొన్ని కథలను వింటున్నారట.అయితే భాగమతి చిత్ర ప్రమోషన్‌ సందర్భంలోనే అనుష్క చాలా అవకాశాలు వస్తున్నా, ఒక్క గౌతమ్‌మీనన్‌ చిత్రం మినహా ఏ చిత్రాన్ని అంగీకరించలేదని చెప్పింది.

 ఆమె ఆ విషయం చెప్పి చాలా కాలమైంది. గౌతమ్‌మీనన్‌ కూడా ఒక మల్టీస్టారర్‌ చిత్రం చేయనున్నట్లు, అందులో నటి అనుష్క నటించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఇప్పుటి వరకూ ప్రారంభం కాలేదు. గౌతమ్‌మీనన్‌ ధనుష్‌ హీరోగా ఎన్నైనోకి పాయు తూట్టా, విక్రమ్‌ హీరోగా ధ్రువనక్షత్రం చిత్రాలను పూర్తి చేసే పనిలోనే ఉన్నారు. తదుపరి శింబు హీరోగా విన్నైతాండి వరువాయా–2 చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. 

దీంతో ఆయన చిత్రం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న అనుష్క ఓపిక నశించడంతో పాటు, దర్శకుడు గౌతమ్‌మీనన్‌పై నమ్మకం సన్నగిల్లిందట. దీంతో ఈయన చిత్రం కోసం ఇంకా వేచి చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చిందన్నది తాజా సమాచారం. అంతే తనతో చిత్రాలు చేస్తామన్న దర్శక నిర్మాతలను పిలిచి కథలు రెడీ చేసుకుని త్వరలో ఆ చిత్రాల వివరాలను ప్రకటించండి అని చెప్పారట. 

మరిన్ని వార్తలు