చిన్నప్పటి నుంచి అవే ఊహలే

20 Mar, 2018 04:51 IST|Sakshi

తమిళసినిమా: అనుష్క అంటే ఒకప్పుడు అందాల నటి మాత్రమే. ఇప్పుడు అందం, అభినయం కలబోసిన జాణ. అలాంటి తార నేను ఊహల్లో జీవించానంటోంది. తన చిన్నతనంలోనే బాహుబలిలో యువరాణిగా ఊహల్లో జీవించేశానని చెప్పుకొచ్చింది. అనుష్క కెరీర్‌లో అరుంధతి, బాహుబలి, రుద్రమదేవి, భాగమతి వంటి చిత్రాలు మైలురాళ్లుగా నిలిచిపోతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుష్కను ఇప్పుడు సాదా సీదా కథా పాత్రల్లో ప్రేక్షకులు జీర్ణించుకోలేరు.

ఈ విషయాన్ని గ్రహించిన స్వీటీ ప్రస్తుతం పాత్రల ఎంపిక విషయంలో చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. అందులో భాగంగానే  కొత్త చిత్రాలు అంగీకరించలేదంటున్న అనుష్క తాజాగా ఒక భారీ చిత్రంలో నటించడానికి రెడీ అవుతోందట. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనుందని సమాచారం. తన సినీ అనుభవం గురించి ఈ బ్యూటీ తెలుపుతూ హీరోయిన్‌ ఓరియంటెడ్‌ చిత్రాల్లో నటించి రాణించగలనని నిరూపించుకున్నానంది.

తన విజయాల వెనుకున్నది దర్శకులేనని, మంచి కథాపాత్రల్లో వాళ్లు నటింపజేయడం వల్లే పేరు అని పేర్కొంది. చిన్నవయసులోనే తాను పురాణ, చరిత్ర పుస్తకాలను ఆసక్తిగా చదివేదాన్ననీ, అదే విధంగా కల్పిత కథలను ఎక్కువగా చదివేదానినని చెప్పింది. అలాంటి కథలోని ఒక పాత్రలో తనను ఊహించుకుని జీవించేదానిననీ అంది. అలాంటి ఊహల్లోంచి బయటకు రావడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదనీ, అదో తీయని అనుభవంగా ఉండేదని పేర్కొంది.

రాజ్యాలు, కోటలు కూడా తన ఊహల్లో మెదిలేవనీ, అలా తాను మహారాణి ఊహించుకుని జీవించేదాన్నని చెప్పింది. ఆ ఊహలే బాహుబలి లాంటి చిత్రాల్లో నటించడానికి ధైర్యాన్నిచ్చాయని భావిస్తానంది. ఇంకా చెప్పాలంటే బాహుబలి చిత్రం తాను చిన్నవయసులో ఊహించిన విధంగానే అమరిందని చెప్పింది.  విజయాల గురించి ఎదురు చూడననీ, బాధ్యతను నిర్వహించు ఫలితాన్ని ఎదురు చూడకు అన్నది తన ఫాలసీ అని పేర్కొంది.

మరిన్ని వార్తలు