సమ్మర్‌లో నిశ్శబ్ధం

29 Jan, 2020 00:02 IST|Sakshi

జనవరి నుంచి ఏప్రిల్‌కి పోస్ట్‌పోన్‌

అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే ఈ శుక్రవారం ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క. సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమాను ఫిబ్రవరి 20కి పోస్ట్‌పోన్‌ చేశారన్నది నిన్న మొన్నటి వార్త. అయితే 20న కూడా నిశ్శబ్దం సందడి ఉండదని తాజా సమాచారం. ఏప్రిల్‌ నెలకు ఈ సినిమా వాయిదా పడిందని భోగట్టా. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్‌ మ్యాడిసన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించారు. థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటించారు. ఈ చిత్రం జనవరి 31న విడుదల కాకపోవడానికి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తి అవ్వకపోవడమే అని తెలిసింది.

అందుకే శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 20న విడుదల చేయాలనుకున్నారు. అయితే పోస్ట్‌ ప్రొడక్షన్‌కి మరో వారం అవసరం అయ్యేలా ఉండటంతో  ఫిబ్రవరి 28వ తేదీన తీసుకువద్దాం అనుకున్నారు చిత్రబృందం. కానీ మార్చి మొదటివారం నుంచి పరీక్షల సీజన్‌ మొదలవుతోంది. సినిమా కలెక్షన్లపై పరీక్షల ప్రభావం పడే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు అనడంతో మళ్లీ విడుదలను వాయిదా వేశారని తెలిసింది. ఈ సినిమాను సమ్మర్‌లో తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించుకుందని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. అందుకు ఏప్రిల్‌ 2 కరెక్ట్‌ డేట్‌ అని, సమ్మర్‌కి కరై్టన్‌ రైజర్‌లా ఈ సినిమా ఉంటుందని టీమ్‌ భావించి ఆ డేట్‌ని కన్‌ఫర్మ్‌ చేశారట. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్‌. కెమెరా: షానీ డియోల్‌.

మరిన్ని వార్తలు