అనుష్కకు అంత లేదా!

5 Oct, 2019 11:46 IST|Sakshi

సినిమా: మణిరత్నం ప్రఖ్యాత దర్శకుడని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన భారీ చిత్రాలనూ తెరకెక్కించగలరు, బడ్జెట్‌ చిత్రాలను బ్రహ్మాండంగా తెరపై ఆవిష్కరించగలరు. అలాగే ప్రేమకథా చిత్రాలను వైవిధ్యంగా చెక్కడంలో సిద్ధహస్తుడు. అయితే ఈ మధ్య కాస్త తడబడ్డ మణిరత్నం సెక్క సివంద వానం చిత్రంతో మళ్లీ గాడిలో పడ్డారు. అది మల్టీస్టారర్‌ చిత్రం. ఆ చిత్రం ఇచ్చిన ఉత్సాహంతో ఒకసారి వాయిదా వేసుకున్న పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ భుజానేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇది కల్కీ అనే రచయిత రాసిన పొన్నియన్‌ సెల్వన్‌ నవల ఆధారంగా అదే పేరుతో తెరకెక్కించనున్న చిత్రం. ఇందులో  నటుడు విక్రమ్, కార్తీ, జయంరవి, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, తెలుగు నటుడు మోహన్‌బాబు, ఐశ్వర్యరాయ్, నయనతార, కీర్తీసురేశ్‌ నటించనున్నారు.  కాగా వీరితో పాటు నటి అనుష్క కూడా ముఖ్యపాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. 

ఆ తరువాత ఆమె నటించడం లేదనే ప్రచారం వైరల్‌ అయ్యింది. అందుకు కారణం నయనతార కంటే తన పాత్ర తక్కువ కావడమేననే ప్రచారం దొర్లింది. అయితే మణిరత్నం చిత్రం నుంచి నటి అనుష్క నటించడం లేదన్నది వాస్తవమే అయినా, అందుకు కారణం నయనతార కాదట. పారితోషికమేనన్న విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చినట్లు తాజా సమాచారం. దక్షిణాదిలో నయనతారకు దీటుగా పేరు తెచ్చుకున్న నటి అనుష్క. ఆమె పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రంలో నటించడానికి రూ.4 కోట్లు డిమాండ్‌ చేసిందని, దీంతో దర్శకుడు మణిరత్నంకు షాక్‌ కొట్టినంత పనైందని సమాచారం. రూ.కోటి ప్లస్‌ జీఎస్‌టీ కలిపి చెల్లిస్తామని చెప్పడంతో ఈ సారి అనుష్కకు షాక్‌ కొట్టినంత పనైందట. ఈ బ్యూటీ పారితోషికం విషయంలో బెట్టు సడలించకపోవడంతో అంతకు వర్త్‌ లేదంటూ మణిరత్నం ఆమె పాత్రలో మరో నటిని ఎంపిక చేసే పనిలో పడ్డారట. అలా ఆ పాత్రకు చెన్నై చిన్నది త్రిష సెట్‌ అయ్యిందని సమాచారం. అయితే అంతకు వర్త్‌ లేదన్న మణిరత్నం మాటల్లో అర్థం, అనుష్కకు అంత సీన్‌ లేదనా లేక ఆ చిత్రంలో ఆమె పాత్రకు అంత వర్త్‌లేదనా అన్నదిప్పుడు చర్చనీయాం«శంగా మారింది. అయితే నటి ఐశ్వర్యారాయ్‌ ద్విపాత్రాభినయం చేయనుండడంతో ఇక అనుష్క పాత్రకు పెద్ద ప్రాధాన్యత ఏముంటుంది? అనే చర్చా జరుగుతోంది.అయినా రూ.4 కోట్లు తీసుకునే అనుష్కను రూ.కోటి పారితోషికం అంటే ఎలా ఒప్పుకుంటుంది. కాగా లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి మణిరత్నం మెడ్రాస్‌ టాకీస్‌ నిర్మించనున్న ఈ చిత్రానికి సంగీతాన్ని ఏఆర్‌.రెహ్మాన్‌ అందిస్తున్నారు. వైరముత్తు రాసిన గీతాలకు ఏఆర్‌.రెహ్మాన్‌ బాణీలను సిద్ధం చేసేశారట. డిసెంబర్‌లో పొన్నియన్‌ సెల్వన్‌ చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని సమాచారం.

మరిన్ని వార్తలు