సెన్సార్‌ పూర్తి చేసుకున్న అనుష్క ‘నిశ్శబ్దం’

27 May, 2020 08:37 IST|Sakshi

అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్‌ మ్యాడిసన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘నిశ్శబ్దం’. హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించారు. థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్‌ 2న ప్రపంచవ్యాప్తంగా ‘నిశ్శబ్దం’తో థియేటర్స్‌లో సందడి చేసేవారు అనుష్క అండ్‌ టీం. కానీ కరోనా లాక్‌డౌన్‌ కారణంగా అన్ని థియేటర్లు మూతపడటంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ చిత్రం మంగళవారం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు హెమంత్‌ మధుకర్‌ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. (చదవండి: నటుడు సూర్యకు గాయాలు..!)

‘మా రెండు చిత్రాలు తెలుగులో నిశ్శబ్దం, సైలెన్స్‌ చూసిన సెన్సార్‌ బోర్డు సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు. ఈ సినిమా చూశాక బోర్డు సభ్యుల స్పందన చూసి చాలా ఆనందం వేసింది. ఈ సినిమాను తొలుత థియేటర్‌లోనే విడదుల చేయాలని సలహా ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు’ అంటూ హేమంత్‌ మధుకర్‌ ట్వీట్‌ చేశాడు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో విడుదలవుతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకుడి ట్వీట్‌ ఆసక్తిరేపుతోంది. ఇక షూటింగ్‌లకు, థియేటర్లకు అనుమతుల్వివ్వాలని టాలీవుడ్‌ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న విషయం తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదల చేసే ప్రక్రియను కొన్నిరోజుల పాటు నిలుపుదల చేసినట్లు తెలుస్తోంది. (బన్నీ సినిమాలో యాంకర్ సుమ!)

‘మా చిత్రం ‘నిశ్శ‌బ్దం’ విషయంలో మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాటికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాము. ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేసేందుకే మేము అధిక ప్రాధాన్యత ఇస్తున్నాము. చాలా కాలం పాటు అందుకు పరిస్థితులు అనుకూలించకపోతే మాత్రం.. అప్పుడు ఓటీటీ గురించి ఆలోచిస్తాము. అప్పుడు అదే బెస్ట్ అని అనుకుంటాము’ అంటూ చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్‌ కొద్దిరోజుల క్రితం ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదలపై ఇప్పట్లో స్పష్టమైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపించట్లేదు. థియేటర్లపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతే ‘నిశ్శబ్దం’ విడుదలపై ఆలోచించాలని చిత్రబృందం భావిస్తుంది.

మరిన్ని వార్తలు