చిన్న సినిమాలకు పెద్ద వరం

25 Aug, 2018 02:55 IST|Sakshi
ప్రసన్నకుమార్, వల్లూరిపల్లి రమేశ్, బసిరెడ్డి, వీరి నాయుడు, ముత్యాల రాందాసు

‘‘ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తెలుగు చిత్ర పరిశ్రమ కోసం తీసుకున్న నిర్ణయం చిన్న సినిమాలకు పెద్ద వరం. 116 జీవో చిన్న సినిమాలతో పాటు నిర్మాతలందరికీ చాలా ప్రయోజనకరంగా ఉంది’’ అని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(టీఎఫ్‌సీసీ) అధ్యక్షుడు వి.వీరినాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని టీఎఫ్‌సీసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వీరినాయుడు మాట్లాడుతూ– ‘‘4 కోట్ల రూపాయలలోపు బడ్జెట్‌తో నిర్మించే చిత్రాలకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడం.. ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మించే ప్రదేశాలకు ఉచితంగా అనుమతి ఇవ్వడంతో పాటు ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) ద్వారా షూటింగ్‌లకు సింగిల్‌ విండో ద్వారా అనుమతి ఇవ్వడం సంతోషించదగ్గ విషయం.

ప్రతి ఏడాది ఎఫ్‌డీసీ పర్యవేక్షణలో 15 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి రూ.10 లక్షలు సబ్సిడీ ఇవ్వడం చాలా మంచి  నిర్ణయం. ప్రభుత్వం ఈ నిర్ణయాలను ఆమోదించడానికి కారకులైన ఏపీ ఎఫ్‌డీసీ చైర్మన్‌ అంబికాకృష్ణగారికి కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఏపీ ప్రభుత్వం జీఎస్‌టీలో రాష్ట్ర వాటా 9 శాతం చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలనే నిర్ణయం కీలకమైంది. తెలంగాణ ప్రభుత్వం కూడా చిత్ర పరిశ్రమపట్ల మంచి నిర్ణయాలు తీసుకుంటోంది’’ అన్నారు టీఎఫ్‌సీసీ సెక్రటరీ ముత్యాల రాందాసు. ఈ సందర్భంగా కేరళ వరద బాధితులకు తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ తరఫున రూ.10లక్షలు విరాళం ప్రకటించారు. ఈ సమావేశంలో టీఎఫ్‌సీసీ సెక్టార్‌ చైర్మన్‌ వల్లూరిపల్లి రమేశ్, కోశాధికారి తుమ్మలపల్లి సత్యనారాయణ, జాయింట్‌ సెక్రటరీ మోహన్‌ వడ్లపట్ల, ఈసీ మెంబర్‌ ప్రసన్న కుమార్, స్టూడియో సెక్టార్‌ తరఫున బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు