చిన్న సినిమాలకు రాయితీలు

21 Aug, 2018 16:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎఫ్‌డీసీ) చైర్మన్‌ అంబికా కృష్ణ పలు రాయితీలను ప్రకటించారు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరించే సినిమాలకు ప్రోత్సాహకాలతో పాటు నగదు, పన్ను రాయితీలు కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు. 4 కోట్ల రూపాయలలోపు రూపొందే సినిమాలను ప్రభుత్వం చిన్న సినిమాలుగా గుర్తించి, ఆ సినిమాలకు పన్ను మొత్తం వెనక్కి ఇవ్వనుందని.. 18 శాతం జీఎస్టీలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 9 శాతం రద్దు చేసి తిరిగి చెల్లిస్తుందని తెలిపారు.

చిన్న సినిమాలకు పన్ను రాయితీలతో పాటు షూటింగ్‌లకు లోకేషన్లు ఉచితంగా ఇవ్వటం‍, ఎఫ్‌డీసీ ద్వారా సింగల్ విండోలో అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. షూటింగ్‌ల కోసం సెక్యురిటి డిపాజిట్ మాత్రం చెల్లిస్తే సరిపోతుందని ఆ డబ్బును కూడా షూటింగ్‌ పూర్తయిన తరువాత వెనక్కి తిరిగిచ్చేస్తామన్నారు. అయితే ఈ చిత్రాలకు సంబంధించిన డబ్బింగ్, రీరికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తిగా ఏపీలోనే చేయాలన్నారు.

రాయితీలతో పాటు చిన్న సినిమాల్లో ఉత్తమ కథాంశాలు, విలువలు ఉన్న 15 చిత్రాలకు 10 లక్షల నజరానా ప్రభుత్వం నుంచి అందిచనున్నట్టుగా తెలిపారు. పరభాషా చిత్రాలు తెలుగులో భారీ ఎత్తున రిలీజ్‌ అవుతుండటంతో ధియేటర్ల సమస్య తలెత్తుందని,  పైరసీ వల్ల సినీరంగం తీవ్రంగా నష్టపోతుందని అలాంటి వాటిపై కూడా చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నటుగా తెలిపారు.
 

మరిన్ని వార్తలు