సంగీత మాంత్రికుడి మరో రికార్డు

14 Apr, 2018 10:04 IST|Sakshi

కీర్తి అంతా భగవంతుడికే. మణిరత్నం చిత్రం కాట్రువెలియిడై చిత్రానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఆయన ఆలోచనల సముద్రం. మణిరత్నం చిత్రం తనకెప్పుడూ ప్రత్యేకమే. మణిరత్నం అన్నయ్య, కార్తీ, చిత్ర యూనిట్‌ అందరికీ కృతజ్ఞతలు. దేశానికి చాలా అవసరమైన చిత్రానికి తనకు జాతీయ అవార్డు రావడం సంతోషం అన్నారు. మామ్‌ చిత్రం కోసం నటి శ్రీదేవి చెన్నైకి వచ్చినప్పుడు ఇది చాలా స్పెషల్‌. అయితే నటి శ్రీదేవినే మిస్‌ అయ్యాం.

సంగీత మాంత్రికుడు ఏఆర్‌ రెహ్మాన్‌ మరో రికార్డును సాధించారు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఉప్పొంగే ఓ కెరటం ఏఆర్‌ రెహ్మాన్‌. సినీ సంగీతాన్ని కొత్తబాట పట్టించిన ధ్రువతార ఈయన. శాస్త్రీయ, కర్ణాటక, పాశ్చాత్య సంగీతాలతో సినీ ప్రేక్షకులను ఓలలాడించిన సంగీత మాంత్రికుడు రెహ్మాన్‌. సంగీతాన్ని ఎప్పటికప్పుడు కొత్త పుంతులు తొక్కిస్తూ ప్రయోగాల వీరుడిగా పేరు గాంచిన ఏఆర్‌ రెహ్మాన్‌ సినీ సంగీతానికే ఒక బ్రాండ్‌గా నిలిచారు. 25 ఏళ్ల కిందట రోజా చిత్రంతో సువాసనలు వెదజల్లి తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును కొల్లగొట్టిన సంగీత గని రెహ్మన్‌. అలా మొదలైన ఈయన సంగీత పయనం కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్‌ దాటి హాలీవుడ్‌లో పరవళ్లు తొక్కింది. 

మహామహులైన భారత సినీ కళాకారులకు కలగా మిగిలిన ఆస్కార్‌ అవార్డును స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌ చిత్రంతో అవలీలగా సాధించారు. సినీ భారతావని కీర్తి కిరీటాలను ప్రపంచానికి చాటారు. సంగీతం ఎల్లలు చెరిపేసిన ఈయన ఎందరో నూతన గాయనీగాయకులకు అవకాశాలను కల్పించి అందులోనూ రికార్డు సాధించారు. రోజా చిత్రంతోనే జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును గెలుచుకున్న ఏఆర్‌.రెహ్మాన్‌ ఆ తరువాత మిన్సార కనువు, కన్నత్తిల్‌ ముత్తమిట్టాల్‌ చిత్రాలకు జాతీయ అవార్డును గెలుచుకున్నారు. అదే విధంగా ఉత్తరాది చిత్ర పరిశ్రమకు వెళ్లి అక్కడ లగాన్‌ చిత్రానికి జాతీయ అవార్డును కైవసం చేసుకున్నారు. తాజాగా కాట్రువెలియిడై తమిళ చిత్రానికి ఉత్తమ సంగీతదర్శకుడి అవార్డును, హిందీ చిత్రం మామ్‌ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతానికి గానూ జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 65వ జాతీయ సినీ అవార్డులను వివరాలను శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతకు ముందు ఒకే వేదికపై స్లమ్‌డాగ్‌ మిలీనియర్‌ చిత్రానికి రెండు ఆస్కార్‌ అవార్డులను అందుకున్న రెహ్మాన్‌ రికార్డు నెలకొల్పారు. అదే విధంగా ఇప్పుడు ఒకే సారి రెండు జాతీయ అవార్డులను అందుకోనున్నారు.ఇదీ రికార్డే. 

ఇళయరాజా రికార్డు బ్రేక్‌ 
ప్రఖ్యాత సంగీతదర్శకుడు ఇళయరాజా సాధించిన జాతీయ అవార్డుల రికార్డును రెహ్మాన్‌ బ్రేక్‌ చేశారు. ఇళయరాజా ఇప్పటి వరకూ 5 జాతీయ అవార్డును గెలుచుకున్నారు. ఏఆర్‌.రెహ్మాన్‌ ఇంతకు ముందు రోజా, కన్నత్తిల్‌ ముత్తమిట్టాల్, మిన్సార కనవు, లగాన్‌ చిత్రాలకు జాతీయ పురష్కారాలను అందుకున్నారు. తాజాగా కాట్రువెలియిడై తమిళ చిత్రంకు, హింది చిత్రం మామ్‌కు గానూ రెండు జాతీయ అవార్డులను గెలుచుకుని ఆరు జాతీయ పురష్కారాలను అందుకున్న సంగీత దర్శకుడిగా ఇళయరాజా రికార్డును బ్రేక్‌ చేశారు. 65 వ జాతీయ అవార్డుల ప్రకటనలో ఈ సారి తమిళ చిత్ర పరిశ్రమ మూడు అవార్డులను గెలుచుకుంది. అందులో కాట్రువెలియిడై చిత్రానికి గానూ ఏఆర్‌.రెహ్మాన్, టూలెట్‌ అనే తమిళ చిత్రానికి ప్రాంతీయ చిత్రాల కేటగిరిలో ఉత్తమ చిత్రంగానూ, కాట్రులియిడై చిత్రంలోని వాన వరువాన్‌ అనే పాటకుగానూ గాయని శాషా త్రిపాధి జాతీయ అవార్డులను ప్రకటించారు. ఇలా ఈ సారి మణిరత్నం తమిళ చిత్రపరిశ్రమ గౌరవాన్ని కాస్త కాపాడారనే చెప్పాలి.

మరిన్ని వార్తలు