మనస్సాక్షే దారి చూపుతుంది!

6 Feb, 2019 06:01 IST|Sakshi
తనయ ఖతీజా ప్రసంగాన్ని వింటున్న రెహమాన్‌

ఏఆర్‌ రెహమాన్‌ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆయన పాటలు నిత్యం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంటాయి. రెహమాన్‌ను గుర్తు చేస్తూనే ఉంటాయి. పదేళ్ల క్రితం ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ చిత్రానికిగాను రెండు ఆస్కార్‌ అవార్డులను అందుకున్నారు రెహమాన్‌. 81వ ఆస్కార్‌ వేడుకలో పది అవార్డ్స్‌కు నామినేట్‌ అయిన ఈ చిత్రం ఎనిమిది అవార్డులను గెలుచుకుంది. అందులో రెహమాన్‌కు రెండు వచ్చాయి. ఈ చిత్రం ఆస్కార్‌ సాధించి పదేళ్లయిన సందర్భంగా ముంబైలో ఓ వేడుక జరిగింది. ఈ వేడుకలో ఏఆర్‌ రెహమాన్, ఆయన కుమార్తె ఖతీజాల ఎమోషనల్‌ స్పీచ్‌ అందరినీ ఆకట్టుకుంది.

‘‘ఎన్నో పెద్ద పెద్ద అవార్డులను సాధించిన ప్రముఖ సంగీత దర్శకునిగా మా నాన్నగారు ప్రపంచానికి తెలుసు. మా నాన్న రెండు ఆస్కార్‌ అవార్డులు సాధించి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో ఆయనలో ఏ మార్పు రాలేదు. అయితే కుటుంబానికి కేటాయించే సమయం తగ్గింది. అయినప్పటికీ మధ్య మధ్య మమ్మల్ని విహారయాత్రలకు తీసుకెళుతూ  ఆ లోటు కూడా తెలియకుండా చేస్తున్నారు. మా నాన్నగారు గొప్ప మానవతావాది. ఎందరికో సహాయం చేస్తుంటారు. కానీ వాటిని మాతో కూడా పంచుకోరు’’ అని ఖతీజా అన్నారు.

ఆ తర్వాత ‘మాతో పాటు ఇప్పటి యువతీ యువకులు పాటించేలా ఏవైనా సలహాలు ఇస్తారా?’ అని తండ్రిని ఖతీజా అడిగితే ‘‘నిజానికి నాకు సలహాలు ఇవ్వడం నచ్చదు. నేను పెరుగుతున్నప్పుడు మా అమ్మ చెప్పిన విలువలనే మీకు (తన బిడ్డలను ఉద్దేశించి) చెబుతూ వచ్చాను. ఇప్పుడు మీరు మీ హార్ట్‌ని ఫాలో అయ్యే టైమ్‌ వచ్చింది. జీవితంలో నీ మనస్సాక్షి మీకు మంచి మార్గనిర్దేశకం అవుతుంది. ఆ భగవంతుడు కూడా మీకు దారి చూపించాలని కోరుకుంటున్నాను’’ అని భావోద్వేగంగా బదులిచ్చారు ఏఆర్‌ రెహమాన్‌. ఈ వేడుకలో నటుడు అనిల్‌ కపూర్, రచయిత గుల్జార్‌ తదితరులు పాల్గొన్నారు. ‘‘పదేళ్ల క్రితమే రెహమాన్‌ ఆస్కార్‌ సాధించడం చాలా ఆనందంగా ఉంది’’ అని ఏ పాటకైతే రెహమాన్‌ అవార్డు సాధించారో ఆ పాటను రచించిన గుల్జార్‌ అన్నారు.
 

మరిన్ని వార్తలు