ఇరవై ఏళ్ల కల నేరవేరింది

24 Mar, 2019 00:41 IST|Sakshi
మోహన్‌లాల్‌

‘‘ఒక విషయాన్ని నిజాయతీగా నమ్మి, అది జరగాలని బలంగా కోరుకున్నప్పుడు ఈ విశ్వంలోని శక్తులన్నీ ఏకమై అందుకు సాయం చేస్తాయి. ‘మరక్కార్‌: ది అరేబియన్‌ కడలింటే సింహమ్‌’ సినిమా తొలి టేక్‌ పూర్తి చేసిన తర్వాత నాకీ విషయం నిజమనిపించింది’’ అని భావోద్వేగభరితంగా అన్నారు మలయాళ నటుడు మోహన్‌లాల్‌. 16వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటి కేరళ ప్రాంతమైన అప్పటి కాలికట్‌లో కుంజాలి మరక్కార్‌ అనే ఓ ముస్లిం నావెల్‌ చీఫ్‌ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

దాదాపు 20ఏళ్ల నుంచి ఈ సినిమా గురించి చర్చించుకుంటూనే ఉన్నారట మోహన్‌లాల్‌ అండ్‌ ప్రియదర్శన్‌. మోహన్‌లాల్‌ మాట్లాడుతూ– ‘‘ప్రియదర్శన్‌తో కలిసి నేను ‘కాలాపాని’ (1996) సినిమా చేస్తున్నప్పుడు టి. దామోదరన్‌గారు (స్క్రీన్‌ప్లే రైటర్‌) మరక్కార్‌ పై సినిమా తీసే ఆలోచన గురించి చెప్పారు. ఆయన మరణించిన తర్వాత కూడా ఈ చిత్రం గురించి ప్రియదర్శన్, నేను బాగా చర్చించుకునేవాళ్లం. జీవితాన్ని రిస్క్‌లో పెట్టి పోర్చుగీసు వారికి వ్యతిరేకంగా పోరాడిన మరక్కార్‌ పాత్రలో నటించడం హ్యాపీగా ఉంది. ఇప్పటికి 104 రోజులు వర్క్‌ చేశాం’’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు