కొత్త వెలుగు తెచ్చినందుకు థ్యాంక్స్‌ సామీ..!

22 Oct, 2018 00:30 IST|Sakshi

ఎన్టీఆర్‌

‘‘అరవింద సమేత వీర రాఘవ’.. ఈ ప్రయత్నానికి మీ ఆశీర్వాదం అందించి, ఈ చిత్రాన్ని విజయ పథంలోకి నడిపించిన అభిమాన సోదరులందరికీ నా వందనాలు. ఓ కొత్త ప్రయత్నానికి నాంది పలికిన నా ఆప్తుడు, నా కుటుంబ సభ్యుడైన త్రివిక్రమ్‌గారిపైన ప్రేక్షక దేవుళ్లందరూ వారి నమ్మకాన్ని ఇంకోసారి ఈ చిత్రంతో బహిర్గతం చేశారు. ఆయనకు రెట్టింపు ఉత్సాహం కల్పించిన ప్రేక్షక దేవుళ్లకి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా’’ అని ఎన్టీఆర్‌ అన్నారు. ఆయన హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’.

ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఎన్టీఆర్‌ మాట్లాడుతూ– ‘‘ఈ విజయ దశమికి నల్లమబ్బు కమ్మినటువంటి ఒక విషాదఛాయలో ఉన్న మా కుటుంబంలోకి ‘అరవింద సమేత వీర రాఘవ’ తో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చినందుకు థ్యాంక్స్‌ సామీ(త్రివిక్రమ్‌). జీవితాంతం గుర్తుండిపోయే చిత్రాన్ని అందించినందుకు థ్యాంక్స్‌. ఈరోజు ఒకే ఒక్క లోటు.. నాన్న(హరికృష్ణ) ఉండుంటే బ్రహ్మాండంగా ఉండేది. కానీ, ఆయన ఇక్కడే ఎక్కడో తిష్ట వేసి ఈ రోజు జరిగే ఈ ఘట్టాన్ని  చూస్తుంటారు. నాన్నగారు లేకున్నా ఆయన హోదాలో ఇక్కడికొచ్చి, ఆశీస్సులు అందించిన బాబాయ్‌కి(బాలకృష్ణ) హృదయపూర్వక పాదాభివందనం’’ అన్నారు.    
 

ముఖ్య అతిథి బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘మానవుడు సినిమాలను వినోదంతో కూడిన సాధనంగా ఎంచుకున్నాడు. మంచి చిత్రాలు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. సినిమాలు ఎలా ఉండాలనేది ఇండస్ట్రీలోని పెద్దలు, నిర్మాతలు, దర్శకులు ఆలోచించాల్సిన విషయం. ‘యన్‌.టి.ఆర్‌’ బయోపిక్‌ షూటింగ్‌లో బిజీగా ఉండి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చూడలేకపోయా. కానీ, సినిమా ఇతివృత్తం చెప్పారు. త్రివిక్రమ్‌గారి కథ, సంభాషణల్లో ఎంతో చురుకుదనం, పదును ఉంటుంది.

ముత్యాల్లాంటి సినిమాని ప్రేక్షకులకు చూపించడం.. నటీనటుల చేత మంచి హావభావాలను రాబట్టుకోగల సత్తా ఉన్న, తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుడు త్రివిక్రమ్‌గారు. అభిమానం వేరు.. ఆత్మాభిమానం వేరు. పోటీ అన్నది ఆరోగ్యకరంగా ఉండాలి. ఇతరుల్ని మనం కించపరిచేలా ఉండకూడదు. ప్రతి వాళ్లూ కష్టపడబట్టే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది. అందరికీ నా అభినందనలు. రాధాకృష్ణ, ప్రసాద్‌గార్లు మంచి సందేశం, ఆలోచనతో కూడిన సినిమా అందించారు. కేవలం వినోదమే కాదు.. ఆలోచనతో కూడిన సినిమాలు అవసరం. ఈ సినిమాని ఇంత హిట్‌ చేసిన ప్రేక్షక దేవుళ్లకి, అభిమానులందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు.

హీరో కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ– ‘‘ఈ ఫంక్షన్‌లో మా నాన్నగారు(హరికృష్ణ) ఉంటే బాగుండు అనే వెలితి నాకు, తమ్ముడికి. కానీ, మన బాలయ్య... బాబాయ్‌ ఆ లోటును తీర్చేశారు. రాయలసీమ యాసను తమ్ముడు చాలా బాగా పలికాడు. త్రివిక్రమ్‌గారు ఫస్ట్‌ టైమ్‌ మంచి ఎమోషనల్‌ సినిమా చూపించారు. నేను ఇళయరాజాగారి ఫ్యాన్‌ని. ఆయన స్థాయిలో ఫస్ట్‌ టైమ్‌ తమన్‌ అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చారనిపించింది’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయాన్ని మాకు దసరా కానుకగా ఇచ్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు నా కృతజ్ఞతలు.

మాటల్లో చెప్పలేని ఆనం దాన్ని పంచారు మీరు. ఈ సినిమాకు పనిచేసిన టీమ్‌ అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు త్రివిక్రమ్‌. ‘‘ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టే త్రివిక్రమ్‌ కథని సృష్టించాడు. ఆ కథలో ఎన్టీఆర్, జగపతిబాబు చాలా బాగా నటించారు. వారి ముగ్గురి వల్లే ఈ సినిమా ఇంతపెద్ద హిట్‌ అయ్యింది’’ అన్నారు పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి. నిర్మాతలు రాధాకృష్ణ, పీడీవీ ప్రసాద్, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు పూజాహెగ్డే, ఈషారెబ్బా, జగపతిబాబు, నరేశ్, సునీల్, బ్రహ్మాజీ, నవీన్‌చంద్ర, శత్రు, ఈశ్వరీరావు, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, రామ్‌–లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు