అవునా..! ఇది నిజమా?

23 Jul, 2016 23:38 IST|Sakshi
అవునా..! ఇది నిజమా?

మూడు ముళ్లు పడి పట్టుమని మూడేళ్లు కూడా కాలేదు. అప్పుడే, కథానాయిక అమలాపాల్, ఆమె భర్త-దర్శకుడు విజయ్ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కడానికి రెడీ అవుతున్నారనే వార్త చెన్నైలో చక్కర్లు కొడుతోంది. ఏ.ఎల్.విజయ్, అమలాపాల్‌ల వైవాహిక జీవితం సాఫీగా సాగడం లేదన్నది చెన్నై కోడంబాక్కమ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఇద్దరూ వేర్వేరు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారట.
 
  వ్యక్తిగత జీవితంలో సమస్యలు మొదలవడంతో విడిపోవాలనుకుంటున్నారని సదరు వార్తల సారాంశం. అందుకే, అమలాపాల్ వరుసగా సినిమాలు అంగీకరిస్తున్నారనే వార్త కూడా వినిపిస్తోంది. వీటిపై వీరిద్దరూ స్పందించలేదు. తెలుగులో ‘బెజవాడ’, ‘నాయక్’, ‘ఇద్దరమ్మాయిలతో’ తదితర సినిమాల్లో అమలాపాల్ నటించిన విషయం తెలిసిందే. ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించిన ‘దైవ తిరుమగళ్’లో (తెలుగులో ‘నాన్న’గా విడుదలైంది) ఆమె హీరోయిన్‌గా నటించారు.
 
ఆ సినిమా అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత విజయ్ దర్శకత్వం వహించిన ‘తలైవా’ అనే తమిళ చిత్రంలోనూ అమలాపాల్ కథానాయికగా నటించారు. ఆ సమయంలో ప్రేమ ఇంకా బలపడింది. 2011లో ప్రేమలో పడిన వీరిద్దరూ మూడేళ్లు రహస్యంగా ప్రేమించుకున్నారు. 2014 జూన్ 12న చెన్నైలో పెళ్లి చేసుకున్నారు. అమల క్రిస్టియన్. విజయ్ హిందువు. నిశ్చితార్థం చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం, పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం జరిగాయి.
 
 పెళ్లయిన కొత్తలో భర్తతో కలసి దిగిన ఫొటోలను అమల సోషల్ మీడియాలో తరచూ పోస్ట్ చేసేవారు. ఈ ఏడాది జనవరి 1న ఫేస్‌బుక్ ఫాలోయర్లకి ‘న్యూ ఇయర్ విషెస్’ చెప్పిన వీడియోలో భర్తతో కలసి కనిపించారు. ఆ తర్వాత ఈ జంట పబ్లిక్‌లో కనిపించలేదు. ఇద్దరూ విడిపోవాలనుకుంటున్నారనడానికి ఇదో నిదర్శనం అని పరిశీలకులు అంటున్నారు. ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న ఈ జంట విడిపోతారా? కలిసి ఉండి, తమపై వచ్చిన వార్తలు నిజం కాదని నిరూపిస్తారా?


అమలాపాల్