మరో వివాదంలో 'అర్జున్ రెడ్డి'

30 Aug, 2017 15:47 IST|Sakshi
మరో వివాదంలో 'అర్జున్ రెడ్డి'

వివాదాలతోనే భారీ హైప్ తెచ్చుకున్న అర్జున్ రెడ్డి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా మీద వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్ లు ఉన్నాయని, పలువురు ఈ సినిమా బ్యాన్ చేయాలంటూ పట్టుబడుతున్నారు. తాజాగా ఈ మూవీ మరో వివాదంలో ఇరుక్కుంది.

తన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా ఈ సినిమా కథ రెడీ చేశానని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చెపుతుండగా.., ఖమ్మంకు చెందిన దర్శకుడు డి నాగరాజు ఈ కథ నాదంటూ అర్జున్ రెడ్డి దర్శక నిర్మాతలకు నోటీసులు పంపాడు. ఇటీవల అర్జున్ రెడ్డి సినిమా చూసిన నాగరాజు, తన దర్శకత్వంలో తెరకెక్కి ఇప్పటికే విడుదలైన ఇక సె..లవ్ సినిమా కథను యథాతథంగా అర్జున్ రెడ్డి సినిమాగా రూపొందించారని ఆరోపిస్తున్నాడు.

అంతేకాదు అర్జున్ రెడ్డి సినిమా ప్రదర్శన వెంటనే నిలిపివేయాలని, తన అనుమతి లేకుండా తన కథతో సినిమా తెరకెక్కించి విడుదల చేసినందు వల్ల తనకు కలిగిన నష్టానికి గానూ వారం రోజుల్లోగా రెండు కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని లేని పక్షంలో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో తెలిపారు.