క్రిటిక్స్‌పై అర్జున్‌ రెడ్డి దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

7 Jul, 2019 13:26 IST|Sakshi

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్‌ రెడ్డి సినిమాతో పరిచయం అయిన దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా. తొలి సినిమాతోనే టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సం‍దీప్‌, అర్జున్‌ రెడ్డి రీమేక్‌తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు. షాహిద్‌ కపూర్‌ హీరోగా కబీర్‌ సింగ్ పేరుతో రిలీజ్ అయిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ బాలీవుడ్‌లోనూ సంచలనాలు నమోదు చేస్తుంది.

అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సినిమాలో మహిళలను తక్కువగా చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్‌ లేని వ్యక్తిగా చూపించారని విమర్శించారు. కానీ రివ్యూలతో సంబంధం లేకుండా కబీర్‌ సింగ్‌ 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డుల దిశగా దూసుకుపోతోంది.

ఈ సందర్భంగా ఫిలిం కంపానియన్‌ యూట్యూబ్‌ చానల్‌తో మాట్లాడిన సందీప్ రెడ్డి వంగా క్రిటిక్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన సినిమాను విమర్శించే వారంతా సూడో స్త్రీవాదులంటూ విమర్శించాడు. వీళ్లంతా ఇండస్ట్రీకి పట్టిన చీడపురుగుంటూ ఘాటుగా స్పందించాడు. సినిమాలోని టెక్నికల్ అంశాలను చర్చించకుండా కొన్ని సీన్స్‌ను మాత్రమే విమర్శిస్తున్నారని ఓ ప్రముఖ ఎనలిస్ట్ పేరును కూడా ప్రస్తావించాడు సందీప్‌ రెడ్డి వంగా. అంతేకాదు కబీర్‌ సింగ్‌ను వైలెంట్‌ సినిమా అంటున్నారు, నా నెక్ట్స్ సినిమాతో వైలెంట్ సినిమా అంటే ఏంటో చూపిస్తా, ఆ సినిమా చూసాక ఈ క్రిటిక్స్‌ స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందన్నారు. తొలి సినిమాతోనే బాలీవుడ్ ఎనలిస్ట్‌లపై విమర్శలు చేసిన సందీప్‌పై మీడియా ప్రముఖులు ఎలా స్పందిస్తారో చూడాలి.

సం‍దీప్‌ ఇంటర్య్వూపై స్పందించిన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, ‘ సందీప్‌ రెడ్డి వంగా అమాయకత్వంతో కూడిన నిజాయితీ, నిజమైన ధైర్యం కలిగిన వ్యక్తి. కబీర్‌ సింగ్‌పై ఆయన తాజా ఇంటర్వ్యూ ఓ సంచలనం’ అంటూ ట్వీట్ చేశారు.


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు