‘వర్మ’కేమైంది!

9 Feb, 2019 08:29 IST|Sakshi

తమిళసినిమా: వర్మకేమైంది? కోలీవుడ్‌లో ఇప్పుడిదే చర్చనీయాంశంగా మారిన షాకింగ్‌ న్యూస్‌. దర్శకుడు బాలా సృష్టి వర్మ. దీన్ని ఆయన సృష్టి అనవచ్చో కాదో. ఎందుకంటే వర్మ బాలా ముద్దుబిడ్డ కాదు. అద్దె బిడ్డ అనవచ్చు. ఆయన రాసుకున్న కథా చిత్రం కాదు. తెలుగులో సంచలన విజయాన్ని అందుకున్న అర్జున్‌రెడ్డి చిత్రానికి రీమేక్‌ వర్మ. నటుడు విక్రమ్‌ వారసుడు ధృవ్‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్న చిత్రం ఇది. ఈ 4 ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థకు ఫస్ట్‌ కాపీ విధానంలో  బాలా నిర్మాణ సంస్థ బీ స్టూడియోస్‌ రూపొందిస్తున్న చిత్రం వర్మ. చిత్ర నిర్మాణం పూర్తి అయ్యింది. ఫిబ్రవరిలో ప్రేమికుల రోజు సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం సాయంత్రం అనూహ్యంగా ఈ4 ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్వాహకులు వర్మ చిత్రాన్ని విడుదల చేయడం లేదని వెల్లడిస్తూ మీడియాకు ఇక ప్రకటనను విడుదల చేశారు.

అర్జున్‌రెడ్డికి రీమేక్‌లా లేదు
అందులో వారు పేర్కొంటూ తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి చిత్రాన్ని వర్మ పేరుతో రీమేక్‌ చేసి ఫస్ట్‌కాపీ బేస్డ్‌లో బాలా బి.స్టూడియోస్‌ సంస్థ తమకు అందించే విధంగా ఒప్పందం చేసుకున్నామన్నారు. అయితే బాలా తెరకెక్కించిన వర్మ చిత్రం ఫస్ట్‌కాపీ చూసిన తరువాత తమకు సంతృప్తి అనిపించలేదన్నారు. చిత్రంలో కొన్ని సన్నివేశాలు ఒరిజినల్‌ చిత్రానికి పూర్తి భిన్నంగా ఉన్నాయన్నారు. దీంతో వర్మ చిత్రాన్ని విడుదల చేయరాదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. అర్జున్‌రెడ్డి చిత్రాన్ని మళ్లీ వేరే దర్శకుడితో రీమేక్‌ చేయనున్నట్లు తెలిపారు. హీరోగా ధృవే నటిస్తారని, ఇతర నటినటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. జూన్‌ 29న విడుదల చేస్తామని ఈ 4 ఎంటర్‌టెయిన్‌మెంట్‌ సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఇలా పూర్తిగా అదీ ఒక జాతీయ అవార్డు గ్రహీత, పలు వైవిధ్యభరిత చిత్రాల సృష్టికర్త తెరకెక్కించిన చిత్రాన్ని విడుదల సంతృప్తిగా లేదని పక్కన పడేయనున్నట్లు చెప్పడం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

నా చిత్రం రిలీజ్‌ కావడం లేదా?
వర్మ చిత్రంలో ధృవ్‌కు జంటగా నవ నటి మేఘాచౌదరి నటించింది. మోడలింగ్‌ రంగంలో పాపులర్‌ అయిన ఈ బెంగాలీ బ్యూటీ హీరోయిన్‌గా ఇదే తొలి చిత్రం. వర్మ చిత్రం విడుదల కావడం లేదు తెలుసా అన్న ప్రశ్నకు మేఘాచౌదరి షాక్‌ అయ్యింది. కొత్తగా రూపొందించనున్న చిత్రంలో ధృవ్‌ నటించనున్నాడు. మరి ఈ చిన్నది ఉంటుందా? అన్నది ఆసక్తిగా మారింది.

విక్రమ్‌ కూడానా?
వర్మ చిత్ర విడుదలను నిలిపేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించడంతో ఆ చిత్ర దర్శకుడు బాలా చాలా హర్ట్‌ అయ్యారు. ఈయనకు దర్శకుడిగా ప్రత్యేక బ్రాండ్‌ ఉంది. ఆయన చిత్రాలకు ఆయనే కథలను రాసుకుంటారు. అలాంటి దర్శకుడు అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు ముందు వ్యతిరేకించారట. అయితే సేతు చిత్రంతో తనకు సినీ జీవితాన్ని చ్చిన నటుడు విక్రమ్‌ తన కొడుకును హీరోగా పరిచయం చేయమని కోరడంతో ఆయన కోసమే అర్జున్‌రెడ్డి చిత్ర రీమేక్‌కు బాలా సమ్మతించినట్లు సమాచారం. అయినా రీమేక్‌ను అలానే కాపీ కొట్టి చేయనని బాలా ముందే చెప్పారట. తీరా వర్మ చిత్రం పూర్తయిన తరువాత నటుడు విక్రమ్‌ కూడా నిర్మాతల తరఫున మాట్లాడటం బాధేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు