నాపై కేసు కొట్టేయండి

31 Oct, 2018 11:59 IST|Sakshi

హైకోర్టులో అర్జున్‌ సర్జా పిటిషన్‌

సీసీహెచ్‌ కోర్టులో విచారణ 2కు వాయిదా

సాక్షి బెంగళూరు: కబ్బన్‌ పార్కు పోలీసు స్టేషన్‌లో తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాల్సిందిగా హైకోర్టులో దక్షిణాది బహుభాషా నటుడు అర్జున్‌ సర్జా పిటిషన్‌ దాఖలు చేశారు. నటుడు అర్జున్‌ తరఫు న్యాయవాది శ్యామ్‌ సుందర్‌ ఈ పిటిషన్‌ను వేశారు. నటి శ్రుతి హరిహరణ్‌ తనపై కబ్బన్‌ పార్కు పోలీసు స్టేషన్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలన్నీ అవాస్తవాలని పిటిషన్‌లో తెలిపారు. శ్రుతి చేసిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేశారు.

కేవలం ప్రచారం కోసం తనపై ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అర్జున్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అర్జున్‌ 37 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారని, 150కి పైగా సినిమాల్లో నటించారని ఆయన తరఫున న్యాయవాది తెలిపారు. అర్జున్‌ హనుమాన్‌ భక్తుడని, చెన్నైలో 32 అడుగుల పొడవు, 17 అడుగుల వెడల్పు ఉన్న ఆంజనేయ విగ్రహాన్ని నిర్మించారని తెలిపారు. శ్రుతి చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఆమె ఆరోపణల వల్ల అర్జున్‌ కుటుంబం మానసికంగా ఎంతో ఇబ్బందులు పడుతోందని పేర్కొన్నారు.

నవంబర్‌ 2కు వాయిదా..
నటుడు అర్జున్‌పై నమోదైన కేసు విచారణతో పాటు అర్జున్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్‌లో దాఖలు చేసిన కేసు విచారణ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు జరిగింది. నగరంలోని మేయోహాల్‌ 22వ సీసీహెచ్‌ హాల్‌లో వాద, ప్రతివాదనలు వినిపించారు. ఈ విచారణలో అర్జున్‌ తరపు న్యాయవాది శ్యామ్‌ సుందర్‌ తమ వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని న్యాయమూర్తిని విన్నవించారు. ఆయన విజ్ఞప్తిని మన్నించిన జడ్జి విచారణను నవంబర్‌ 2కు వాయిదా వేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో భాగంగా శ్రుతి తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ మీటూ కేసులో పోలీసులు చాలా నెమ్మదిగా విచారణ చేపడుతున్నారని ఆమె తరఫు న్యాయవాది అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించాలని ఆయన డిమాండ్‌ చేశారు. తనిఖీని నిదానంగా చేస్తూ నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సాకు‡్ష్యలను ఇప్పటివరకు పోలీసులు విచారించనే లేదని తెలిపారు. పోలీసులు ఉద్ధేశపూర్వకంగానే దర్యాప్తును ఆలస్యంగా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

శ్రుతికి రక్షణ కల్పించండి..
శ్రుతి హరిహరణ్‌ మీటూ కేసుకు సంబంధించి అర్జున్‌ లేదా ఆయన అభిమానుల నుంచి ఆమెకు ప్రాణహాని ఉందని మహిళా కమిషన్‌ తెలిపింది. శ్రుతికి ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు రక్షణ కల్పించాలని మహిళా కమిషన్‌ నాగలక్ష్మి బాయి కోరారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ టి.సునీల్‌ కుమార్‌కు నాగలక్ష్మి బాయి లేఖ రాశారు. 

మరిన్ని వార్తలు