జెంటిల్‌మేన్‌ వల్ల రెస్పెక్ట్‌ వచ్చింది

17 Aug, 2018 00:16 IST|Sakshi
అర్జున్‌

‘జెంటిల్‌మెన్‌’ సినిమా గురించి అర్జున్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి ముందు నా స్వీయ దర్శకత్వంలో ఓ సినిమా చేశాను. అది చాలా పెద్ద హిట్‌ అయ్యింది. తెలుగులో ఆ సినిమాను ‘రౌడీ పోలీస్‌’ పేరుతో రిలీజ్‌ చేశాం. ఆ సినిమా డిస్ట్రిబ్యూషన్‌ కూడా నేనే చేసుకున్నాను. ఆ సినిమా విజయంతో మళ్లీ నేను మంచి పొజిషన్‌కు వచ్చాను. అంతకుముందు నేను చేసిన సినిమాల వల్ల  ఆర్థికంగా చాలా నష్టపోయాను. అప్పుడు నేను చేసిన అప్పుల వల్ల నా దగ్గర ఉన్నదంతా పోగొట్టుకున్నాను. ఆ బాధలో ఉండి, ఇండస్ట్రీలోని ఎవ్వరినీ కలవటానికి  ఇష్టపడలేదు.

అప్పుడు శంకర్‌ నా దగ్గరికి ఓ కథ తీసుకుని వచ్చారు. ఆయన పదిసార్లు నా దగ్గరికి వచ్చినా నేను వినటానికి ఇష్టపడలేదు. ఫైనల్‌గా ఓ రోజు శంకర్‌ మా ఇంటికి వచ్చి ‘సార్‌ మీరు సినిమా చెయ్యొద్దు. కానీ ఓ సారి నా సినిమా కథ వినండి’ అన్నారు. అప్పుడు ‘జెంటిల్‌మేన్‌’ కథ విన్నాను. కథ విన్న వెంటనే ఇండస్ట్రీ మీద ఉన్న కోపం అంతా పోయింది. కథ చెప్పేటప్పుడే చిన్న చిన్న డిటెయిల్స్‌ కూడా చెప్పారు. అయితే కొత్త దర్శకుడు సినిమా ఎలా తీస్తాడో అనే అనుమానం ఉండేది. కానీ శంకర్‌ ఒక విషయంలో చాలా అదృష్టవంతుడనే చెప్పాలి.

ఎందుకంటే ఆ టైమ్‌లో నా మార్కెట్‌కంటే మరో రెండు రెట్లు అదనంగా ఖర్చు చేసి సినిమాను నిర్మించారు చిత్రనిర్మాత కుంజుమోన్‌. ఆ సినిమా చేస్తున్నప్పుడు కుంజుమోన్‌ ‘నువ్వు స్టేట్‌ అవార్డ్‌ దక్కించుకుంటావు’ అనేవారు. అది నిజమైంది. నాకైతే ‘జెంటిల్‌మేన్‌’ వచ్చి 25 ఏళ్లయిందా అనిపిస్తోంది. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇప్పటికీ నటిస్తున్నానంటే కారణం హార్డ్‌వర్క్‌. అలాగే మన బిహేవియర్‌లో భయం, బాధ్యత ఉండాలి. ఇక్కడ భయం అంటే నా ఉద్దేశం.. ప్రొడ్యూసర్‌ మనపై డబ్బు పెట్టాలి అంటే, జనం మనకోసం టిక్కెట్‌ కొనుక్కుని వస్తున్నారంటే మనం చాలా భయంగా ఉండాల్సిందే. ఆ భయమే మనకు శ్రీరామరక్ష. ‘జెంటిల్‌మేన్‌’ సినిమా వల్ల డబ్బు కాదు.. రెస్పెక్ట్‌ వచ్చింది’’ అన్నారు.

మరిన్ని వార్తలు