డైరెక్టర్‌ కాకుంటే రిపోర్టర్‌ అయ్యేవాణ్ణి

2 Dec, 2019 00:35 IST|Sakshi
టి. సంతోష్‌

‘‘ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులతో పోల్చినప్పుడు తెలుగు ప్రేక్షకులు భావోద్వేగభరిత అంశాలను ఇష్టపడతారు. మంచి సినిమాలను బాగా ప్రోత్సహిస్తారు. కంటెంట్‌ ఉన్న సినిమాలకు మంచి కలెక్షన్స్‌ వస్తాయి. కన్నడ ఇండస్ట్రీలో నాకు అవకాశం వచ్చినప్పటికీ నేను వదలుకున్నాను. తెలుగు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం’’ అని టి. సంతోష్‌ అన్నారు. నిఖిల్, లావణ్యా త్రిపాఠి జంటగా టి. సంతోష్‌ దర్శకత్వంలో ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో రాజ్‌కుమార్‌ ఆకెళ్ల నిర్మించిన చిత్రం ‘అర్జున్‌ సురవరం’. గత శుక్రవారం (నవంబరు 29) విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా టి. సంతోష్‌ చెప్పిన విశేషాలు...

► ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో వచ్చిన ‘సెవెన్త్‌ సెన్స్, తుపాకీ’ సినిమాలకు దర్శకత్వ శాఖలో పని చేశాను. ఆ తర్వాత ‘కణిదన్‌’ సినిమాకి దర్శకత్వం వహించాను. ఈ సినిమాను చూసి మురుగదాస్‌గారు మెచ్చుకున్నారు.. తెలుగు రీమేక్‌ అవకాశం వస్తే వదులుకోవద్దన్నారు.

► ‘కణిదన్‌’ సినిమా చూసిన నిఖిల్‌..నిర్మాత థానుగారి ద్వారా నన్ను సంప్రదించారు.

► నిఖిల్‌ అంకితభావం ఉన్న నటుడు. ఈ  పాత్ర కోసం బరువు పెరిగారు. తెలుగు స్క్రిప్ట్‌పై వర్క్‌ చేశాం కాబట్టే అవుట్‌పుట్‌ బాగా వచ్చిందనిపిస్తోంది. తమిళ వెర్షన్‌ కన్నా, తెలుగు వెర్షన్‌లోనే ఎక్కువ ఎమోషన్స్‌ను జోడిస్తే వర్కౌట్‌ అయ్యింది.. టీమ్‌ అందరూ సహకరించారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడం బాధించింది.

► నేను డైరెక్టర్‌ని కాకపోయి ఉంటే రిపోర్ట్‌ని అయ్యి ఉండేవాణ్ణి. అందుకే జర్నలిజం నేపథ్యంలో ‘కణిదన్‌’లాంటి కథ రాసుకున్నాను.  భవిష్యత్‌లో సీక్వెల్‌ గురించి ఆలోచిస్తా.         నా తర్వాతి చిత్రం గురించి త్వరలో వెల్లడిస్తా.

మరిన్ని వార్తలు