రెండోసారి తల్లవుతున్న అర్పిత.. ఆరోజే..

21 Nov, 2019 16:01 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సోదరి అర్పితా ఖాన్‌ శర్మకు తన అన్నయ్య అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీలు చిక్కినప్పుడల్లా సోదరుడిపై ఉన్న ప్రేమను చాటుకుంటారు ఆమె. సోషల్‌ మీడియాలో తమ బంధాన్ని ప్రతిబింబించే ఫొటోలను అభిమానులతో పంచుకుంటారు. సల్మాన్‌ కూడా అంతే. తోడబుట్టిన చెల్లెలు కాకపోయినా... అంతకంటే ఎక్కువ ప్రేమనే అర్పితపై కురిపిస్తాడు. ఎంత బిజీగా ఉన్నా చిట్టి చెల్లెలికి సంబంధించిన ప్రతీ వేడుకకు హాజరై ప్రత్యేక బహుమతులతో ఆమెను ఆశ్చర్యపరుస్తాడు. అంతేకాదు మేనల్లుడు ఆహిల్‌ను సైతం ఎంతో గారాబం చేస్తాడు. అయితే ఇకపై సల్మాన్‌ ప్రేమ కేవలం ఆహిల్‌కు మాత్రమే పంచడం కుదరదట. ఎందుకంటే అతడికి తోడుగా చెల్లెలో, తమ్ముడో త్వరలోనే అర్పిత ఇంట అడుగుపెట్టబోతున్నారట.

అవును అర్పిత ఇప్పుడు గర్భవతి. త్వరలోనే ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. వచ్చే నెలలోనే ఆమెకు డెలివరీ డేట్‌ ఇచ్చారు. అయితే ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది. తన అన్నతో ఉన్న అనుబంధానికి గుర్తుగా సల్మాన్‌ పుట్టినరోజు అయిన డిసెంబరు 27న డెలివరీ(సీ- సెక్షన్‌) చేయాల్సిందిగా అర్పితా ఖాన్‌ డాక్టర్లను కోరారట. ఈ క్రమంలో అర్పిత- ఆయుష్‌ దంపతులు రెండో బిడ్డ భాయీజాన్‌ బర్త్‌డే నాడే ఈ లోకంలోకి వచ్చే అవకాశం ఉంది. కాగా అర్పితా ఖాన్‌ వివాహం 2014లో ఆయుష్‌ శర్మతో హైదరాబాద్‌లో జరిగిన సంగతి తెలిసిందే. చౌమహల్లా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరై వారిని ఆశీర్వదించారు. పెళ్లి సందర్భంగా దాదాపు రూ.16 కోట్ల విలువ చేసే ఫ్లాట్‌ను సల్మాన్‌ చెల్లెలికి బహుమతిగా ఇచ్చాడు. ఇక అర్పిత సల్మాన్‌ సొంత చెల్లెలు కాదన్న సంగతి తెలిసిందే. సల్మాన్‌ తల్లిదండ్రులు ఆమెను దత్తత తీసుకున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా